మీడియాపై చిందులేసిన మంత్రి
దేశ రాజధానిలో చికన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని.. వీటివల్ల జనం చనిపోతున్నారని అడిగినందుకు మీడియా ప్రతినిధులపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చిందులేశారు. చికన్ గున్యా వల్ల ఎవరూ చనిపోరని, దమ్ముంటే దానివల్లే మరణించినట్లు వైద్యపరంగా రుజువు చేయాలని ఆయన అన్నారు. అసలు చికన్ గున్యా విపరీతంగా వ్యాపించడం ఏమీ లేదని, అదంతా మీడియా సృష్టేనని.. జనానికి మీరే భయం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నా.. ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ మాత్రం గోవా వెళ్లి అక్కడ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే పనిలో పడటం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగాయి. దాని గురించి మీడియా ప్రశ్నించగా.. ఇద్దరు ఎంసీడీ మేయర్లు ఢిల్లీలో లేరని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వాళ్ల పనేనని, వాళ్లు ఎందుకు లేరో అడగాలని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో కేవలం 40 శాతం ఆస్పత్రి పడకలే ఉన్నాయని, వాటితోనే తాము రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిందని అడగ్గా.. 'మోదీ, ఎల్జీ' అని ఆయన సమాధానం చెప్పారు.