delhi health minister
-
మంత్రిపై చెప్పు విసిరిన మహిళ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఓ మహిళ చెప్పు విసిరింది. మంగళవారం మధ్యాహ్నం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం బయట భావన అరోరా అనే ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త జైన్‌పై చెప్పు విసిరింది. ఆయన కొద్దిలో తప్పించుకోగా, చెప్పు వాహనంపై పడింది. ఆ సమయంలో వాహనంలో ఆయనతో పాటు ఆప్ నేతలు సంజయ్ సింగ్, అశుతోష్ ఉన్నారు. భారత్ సైన్యం చేసిన సర్జికల్ దాడులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే దాడిచేశానని భావన చెప్పింది. ఆప్ నేతలు పాకిస్థాన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసుకు సంబంధించి జైన్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఇదో పెద్ద కుట్ర.. అసెంబ్లీలో బట్టబయలు చేస్తా: సీఎం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నోటీసులు ఎదుర్కొంటున్న తన కేబినెట్లోని ఆర్థికశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలబడ్డారు. కావాలనే ఆప్ మంత్రులను కేసుల్లో ఇరికిస్తున్నారని, ఇందులో పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఐటీ సమన్ల నేపథ్యంలో మంగళవారం ఉదయమే జైన్‌ను పిలిపించుకొని సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. మాజీ సీనియర్ ఐటీశాఖ అధికారి అయిన కేజ్రీవాల్ జైన్ అమాయకుడని, ఆయన పత్రాలన్నింటినీ తాను పరిశీలించాలనని, కావాలనే ఆయనను ఇరికించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ’ ఒకవేళ అతను దోషి అయి ఉంటే మేమే అతన్ని గెంటేసే వాళ్లం. అతనికి మేం అండగా నిలిబడతాం’ అని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులపై కావాలనే కేసులు పెడుతున్నారని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని, ఈ కుట్రను శుక్రవారం అసెంబ్లీలో బట్టబయలు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ప్రశ్నించడానికి సత్యేందర్ జైన్‌కు ఐటీశాఖ సమన్లు జారీచేసింది. కాగా, ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది నాయకులు వివిధ కేసులలో ఇరెస్టయ్యారు. గతవారంలో కూడా ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతి, అమానతుల్లా ఖాన్‌లను అరెస్టుచేసినా, రెండు రోజుల్లోనే వాళ్లిద్దరూ బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు. -
మంత్రి గారికి తప్పని కష్టాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కష్టాలు వీడటం లేదు. నిన్న మొన్నటి వరకు డెంగ్యూ తీవ్రస్థాయిలో ఉన్నా సరిగా పట్టించుకోవడం లేదంటూ జనం ఆయన మీద పడితే.. ఇప్పుడు తాజాగా ఆదాయపన్ను నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ శాఖ ఆయనకు నోటీసు జారీచేసింది. అయితే, ఇది పాత కేసులో రీ ఎసెస్మెంట్ మాత్రమేనని, అంతేతప్ప కొత్త కేసు ఏమీ కాదని జైన్ అంటున్నారు. తనను ఒక సాక్షిగా మాత్రమే పిలిచారన్నారు. గతంలో తాను ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టానని, వాటి విషయంలోనే రీ ఎసెస్మెంట్ జరుగుతున్నందున తనను పిలిచారని ఆయన చెప్పారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ఓ పెద్ద విషయం బయట పెట్టబోతున్నారని, దమ్ముంటే టీవీ చానళ్లు దాన్ని ప్రసారం చేయాలని ఆయన సవాలు చేశారు. కాగా, ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది నాయకులు వివిధ కేసులలో ఇరెస్టయ్యారు. గతవారంలో కూడా ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతి, అమానతుల్లా ఖాన్‌లను అరెస్టుచేసినా, రెండు రోజుల్లోనే వాళ్లిద్దరూ బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు. -
మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!
వైద్య ప్రముఖులు చెప్పేదాని కంటే గూగులమ్మ చెప్పే విషయాల మీదే ఆరోగ్య మంత్రికి నమ్మకం ఎక్కువట. చికన్‌గున్యా వల్ల మరణాలు సంభవించవని, అలాగని గూగుల్ తనకు చెప్పిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. అందుకే ఢిల్లీవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ లక్షణాలు కనపడితే జాగ్రత్తలు తీసుకుని, ఆస్పత్రికి వెళ్తే చాలని చెప్పారు. అక్కడ వైద్యులు చెబితేనే ఆస్పత్రిలో చేరాలి తప్ప లేకపోతే అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఒకే ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చికన్ గున్యాతో చనిపోయారని.. మరి దానిగురించి ఏమంటారని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఎక్కడా చికన్ గున్యా మరణాలు లేవని.. కేవలం ఢిల్లీలో ఒక ఆస్పత్రిలోనే ఎందుకు ఉంటున్నాయని ఎదురు ప్రశ్నించడంతో పాటు వాళ్లు అప్పటికే వయసుమీరి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తన విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు. -
మీడియాపై చిందులేసిన మంత్రి
దేశ రాజధానిలో చికన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని.. వీటివల్ల జనం చనిపోతున్నారని అడిగినందుకు మీడియా ప్రతినిధులపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చిందులేశారు. చికన్ గున్యా వల్ల ఎవరూ చనిపోరని, దమ్ముంటే దానివల్లే మరణించినట్లు వైద్యపరంగా రుజువు చేయాలని ఆయన అన్నారు. అసలు చికన్ గున్యా విపరీతంగా వ్యాపించడం ఏమీ లేదని, అదంతా మీడియా సృష్టేనని.. జనానికి మీరే భయం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నా.. ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ మాత్రం గోవా వెళ్లి అక్కడ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే పనిలో పడటం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగాయి. దాని గురించి మీడియా ప్రశ్నించగా.. ఇద్దరు ఎంసీడీ మేయర్లు ఢిల్లీలో లేరని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వాళ్ల పనేనని, వాళ్లు ఎందుకు లేరో అడగాలని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో కేవలం 40 శాతం ఆస్పత్రి పడకలే ఉన్నాయని, వాటితోనే తాము రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిందని అడగ్గా.. 'మోదీ, ఎల్జీ' అని ఆయన సమాధానం చెప్పారు.