
మంత్రి ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులు
చెన్నై: రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ కి సంబంధించిన పలు ఆస్తులు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం వేకువజామున సోదాలు చేపట్టారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలు విచ్చలవిడిగా డబ్బును పంచుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్యశాఖమంత్రి విజయభాస్కర్ ధన ప్రవాహంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని నాలుగు కేసులు నమోదయ్యాయి.
మంత్రి విజయభాస్కర్ నేరుగా రంగంలోకి దిగి డబ్బులు పంచుతూ ఓటర్లను కొంటున్నారని ఫిర్యాదులు అందినట్లు ఐటీ శాఖ దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకూ తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో 13 ప్రాంతాల్లో, చెన్నైలో 19 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఐటీశాక సోదాలు చేపట్టిన ఏకైక మంత్రి విజయభాస్కర్ కావడం గమనార్హం.
కొన్ని కాలేజీలలో, మంత్రి ఇళ్లు, గెస్ట్ హౌస్ లు, ఆయనకు అత్యంత సన్నిహితులకు సంబంధించిన ఆస్తులపై నిఘా పెంచామని.. పట్టుబడ్డ నగదు, ఆస్తుల వివరాలపై త్వరలో ప్రకటన వెల్లడిస్తామని తెలిపారు. అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయిన తరుణంలో విజయభాస్కర్ వెలుగులోకి వచ్చారు. ఆపై మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఇంట్లో సోదాలు
ఐటీశాఖ అధికారులు రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల ఆస్తులతో పాటు నటుల ఇళ్లపైనా దాడులు నిర్వహిస్తోంది. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ప్రముఖ నటుడు శరత్ కుమార్ కొట్టివక్కంలోని ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, ఆస్తులతో పాటు నటుడు శరత్ కుమార్ కు చెందిన ఆస్తులు, మరికొందరు ప్రముఖ పారిశ్రామిక వేత్తల ఇళ్లలోనూ ఐటీశాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నేటి వేకువజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైతో పాటు తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో దాదాపు 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ప్రముఖ నటుడు శరత్ కుమార్ కొట్టివక్కంలోని ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించటం గమనార్హం.