సాక్షి, న్యూఢిల్లీ : అవాంఛనీయ వలసలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎత్తైన గోడలను నిర్మించాలని నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు భారత్ సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ట్రంప్ జాతి పేరిట మెక్సికోలను అడ్డుకోవాలనుకుంటే ఇక్కడ భారత్‌లో మతం పేరిట వలసలను అడ్డుకోవాలనుకుంటోంది. మెక్సికోలు రేపిస్టులు, నేరస్థులు, మాదక ద్రవ్యాల వ్యాపారులని ట్రంప్ ఆరోపిస్తుండగా, ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలను చొరబాటుదారులని, భూ ఆక్రమణదారులని, ఆవుల స్మగ్లర్లని, వారి నుంచి టెర్రరిస్టుల ముప్పు కూడా పొంచి ఉందని భారత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న హిందువులను మాత్రం శరణార్థుల క్యాటగిరీ కింద చూస్తోంది.
అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎనిమిది అడుగుల ఎత్తైన గోడ ఉండాలని, అక్కడక్కడ కరెంట్ షాక్ కొట్టే వ్యవస్థ ఉండాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఇలాగే ఉండాలని మన భారత దేశం ఇదివరకే నిర్ణయించింది. భారత్‌కు, బంగ్లాదేశ్ మధ్య 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది కొండలు, గుట్టలతోపాటు దట్టమైన అడవులు, సుడులు తిరిగే నదీ నదాలతోని కూడి ఉంది. ఇందులో 70 శాతం సరిహద్దు ప్రాంతం భారత్‌కు చెందిందా లేదా బంగ్లాదేశ్‌కు చెందిందా? లేదా అక్కడే స్థిరపడిన స్థానికులదా? అన్నది స్పష్టంగా తేల్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మొదటి విడత కింద 854 కిలోమీటర్ల వరకు సరిహద్దు గోడ లేదా కంచె నిర్మించాల్సిందిగా 1989లో భారత ప్రభుత్వం నిర్ణయించింది.
రెండో విడత కింద 2,502 కిలోమీటర్లు కంచె నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇప్పటికే 1930 కిలోమీటర్లు పూర్తయిందని కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కంచె నిర్మాణం వల్ల ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలు కంచెకు ఇటు ఉండగా, వారి భూములు కంచెకు అవతల ఉండిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లాలంటే కంచె గేటులో నుంచి సైనికుల అనుమతి తీసుకొని వెళ్లాలి. అనుమతి తీసుకొని రావాలి. ఆలస్యమైతే గేటు మూత పడుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలి. గేటుకు అటూ, ఇటూ ఉండే బంధువుల పరిస్థితి మరీ దారణంగా ఉంది. సైనికుల చేతులు తడిమితేగానీ వారు ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదు.
ఇక 48 కిలోమీటర్ల మేర పారుతున్న బ్రహ్మపుత్ర నదిని కలుపుకొని పలు ఉప నదుల వెంట 1,100 కిలోమీటర్ల సరిహద్దు కంచెను నిర్మించాల్సి ఉంది. దిగువ అస్సాంలోని ధూరి జిల్లాలో 300 కిలోమీటర్ల మేర సుందర్ బాన్ అడువులు ఉన్నాయి. ఈ అడవుల్లో భౌతిక కట్టడం నిర్మించడం అసాధ్యం. ఇన్‌ఫ్రా కిరణాల పిల్లర్లు, స్మార్ట్ సెన్సర్లను ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు ఇదివరకే తేల్చారు. దాని వల్ల కూడా పూర్తి ప్రయోజనం నెరవేరదని చెప్పారు. ఒక లేజర్ కిలోమీటరుకు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రయోగాత్మకంగా నాలుగు కిలోమీటర్లు నిర్మించారు. మిగిలిన 296 కిలోమీటర్ల పొడవున ఈ జనవరిలోగా పూర్తి చేయాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు ఏ మేరకు పనులు జరిగాయో ప్రభుత్వం చెప్పడం లేదు.
ఇక నదులు, కొండలు ఉన్న 1100 కిలోమీటర్లలో సరిహద్దు కంచెను నిర్మించడం పూర్తిగా అసాధ్యం. ఆ ప్రాంతంలో నదుల సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ‘ఇది ఇరుదేశాల మధ్య సరిహద్దు’ అన్నది తేల్చడం కష్టం. ఆ ప్రాంతాల్లో జనావాసా ప్రాంతాలు కూడా నదులు సరిహద్దులు మారినప్పుడల్లా తమ నివాస ప్రాంతాలను ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు మార్చుకుంటారట. అక్కడి ప్రజలకు ఏది భారత్ సరిహద్దో, ఏది బంగ్లా సరిహద్దో తెలియదట. ఇలాంటి ప్రజావాస ప్రాంతాలను ‘అంతర్జాతీయ పరివేష్టిత జనావాస ప్రాంతాలు లేదా బంగ్లాదేశ్ చుట్టూరా ఉన్న భారత ప్యాకెట్స్’ అని పిలుస్తారని డచ్ చరిత్రకారుడు విల్లెమ్ వ్యాన్ షెండెల్ తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లోని జనావాస ప్రాంతాల మధ్య ఒకే రకమైన సంస్కృతి ఉంటుందని, పైగా సరిహద్దుకు ఇవతలి గ్రామం ఉత్పత్తులను అవతలి గ్రామం, అవతలి గ్రామం ఉత్పత్తులను ఇవతలి గ్రామం కొనుగోలు చేస్తోందని, ఈ గ్రామాల మధ్య కంచె నిర్మిస్తే ఆ గ్రామాల ప్రజలు ఏమవుతారని షెండెల్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017–18 ఆర్థిక బడ్జెట్‌లో బంగ్లా సరిహద్దులో ఫ్లడ్ లైట్ల కోసం 1327 కోట్లు, మౌలిక సౌకర్యాల కోసం 2,600 కోట్లు, 383 అదనపు ఔట్ పోస్టుల కోసం 15,569 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇంత సొమ్మును ఖర్చు పెట్టిన ఆశించిన ఫలితం ఉండదని షెండెల్ అంటున్నారు. బంగ్లా, భారత్ దేశాల మధ్య భౌతిక సరిహద్దులుకాదని, సామాజిక సరిహద్దులు బలంగా ఉన్పప్పుడే ఆశించిన ఫలితాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment