హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం! | India building world's highest railway bridge in Himalayas | Sakshi
Sakshi News home page

హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం!

Jul 12 2014 2:52 AM | Updated on Sep 2 2017 10:09 AM

హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం!

హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం!

భారత్‌లో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. జమ్మూ కాశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైలు వంతెన ను రైల్వే శాఖ నిర్మిస్తోంది.

కాశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తై రైలు వంతెన
 చినాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే శాఖ

 
కౌరీ(జమ్మూకాశ్మీర్): భారత్‌లో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. జమ్మూ కాశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైలు వంతెన ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. భారీ పర్వతాల మధ్య కౌరీ ప్రాంతం వద్ద చేపట్టిన ఈ వారధి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది. వంతెన నిర్మాణం కోసం రైల్వే ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. కేబుల్ క్రేన్ల సాయంతో తోరణాల మాదిరిగా ఉక్కు స్తంభాలను నిలబెట్టి వంతెనను నిర్మిస్తున్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో భారీ వస్తువులను వంతెన వద్దకు తరలించేందుకు హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నారు. మొత్తం 25 వేల టన్నుల ఉక్కును వాడుతున్నారు. నదీప్రవాహానికి ఆటంకం లేకుండానే బ్రిడ్జిని నిర్మించడం అనేది పెద్ద సవాలుగా మారిందని అయినా, 2016 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తై రైల్వే వంతెన చైనాలోని గిర ప్రావిన్స్‌లో బీపాన్‌జియాంగ్ నదిపై ఉంది. ఆ వంతెన ఎత్తు 275 మీటర్లు కాగా.. కాశ్మీర్‌లో నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తు అంతకన్నా 84 మీటర్లు ఎక్కువ కానుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది.

భూకంపం వచ్చినా తట్టుకుంటుంది...: ఈ వంతెన నిర్మాణం 2002లోనే ప్రారంభమైంది. అయితే ఈ ప్రాంతంలో భూకంపాల ముప్పు ఉండటం, బలమైన గాలులు వీస్తుండటం వంటి కారణాల వల్ల వంతెన నిలుస్తుందా? లేదా? అన్న సందిగ్ధంతో 2008లో పనులు ఆపేశారు. అధ్యయనాల తర్వాత భూకంపాలు వచ్చినా, బలమైన గాలులు వీచినా తట్టుకునేలా బ్రిడ్జిని డిజైన్ చేశారు. ఎట్టకేలకు నిర్మాణం తిరిగి మొదలైంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ వంతెనకు రూ. 552 కోట్ల వ్యయం కానుందని అంచనా. ఈ  వంతెన బారాముల్లా, జమ్మూప్రాంతాలను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం సాగుతున్న 13 గంటల ప్రయాణం 4గంటలకు తగ్గుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement