
సమసిన డోక్లాం వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు భారత్, చైనాలు ఒప్పుకున్నాయని భారతీయ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో నెలలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెర పడినట్లు అయింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపింది.
సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాలు సైన్యాన్ని డోక్లాం సరిహద్దు నుంచి ఉప సంహరించే ప్రక్రియను ముగిస్తాయని వెల్లడించింది. కాగా, భారత్-చైనాల మధ్య ఈ ఏడాది జూన్ నుంచి డోక్లాంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు ముందు డోక్లాం వివాదం సమసిపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రిక్స్ గ్రూప్ సమావేశానికి త్వరలో మోదీ చైనా పర్యటనకు వెళ్తారు. రహస్య సమాచారం ప్రకారం.. భారత్-చైనా బలగాలు ఇప్పటికే డోక్లాం నుంచి వెనక్కురావడం ప్రారంభమైందని తెలిసింది. కానీ సోమవారమే సైన్యం మొత్తం వెనక్కు వస్తుందా? లేదా అన్న విషయంపై క్లారిటీ రాలేదు.
డోక్లాంలో సైన్యం ఉపసంహరణతో భారత్ తన మాట నెగ్గించుకున్నట్లయింది. ఇరు దేశాలు ఒకేసారి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ చైనాకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, మాటలతో భారత్‌ను లొంగదీయాలని చూసిన చైనా ఆటలు సాగలేదు. ఆఖరుకు తనే ఒక మెట్టు దిగి భారత్‌తో కలసి నడవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.