ఆయుధాల దిగుమతిలో మళ్లీ మనమే నెంబర్‌ వన్‌ | India continues to be largest importer of arms | Sakshi
Sakshi News home page

ఆయుధాల దిగుమతిలో మళ్లీ మనమే నెంబర్‌ వన్‌

Published Wed, Mar 14 2018 2:57 AM | Last Updated on Wed, Mar 14 2018 2:57 AM

India continues to be largest importer of arms - Sakshi

దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో మళ్లీ మనమే నెంబర్‌ వన్‌గా నిలిచాం.. 2008–12, 2013–17 మధ్య కాలంలో భారత్‌ ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగినట్టు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒకవైపు చైనా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తుంటే... పాకిస్తాన్‌ ఆయుధాల దిగుమతిని గణనీయంగా తగ్గించుకుంటే భారత్‌ మాత్రం ఇతర దేశాల మీదే ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గతఅయిదేళ్ల కాలంలో దిగుమతుల్ని పరిశీలిస్తే 12 శాతం భారత్‌ చేసుకుంటున్నవే.  రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణకొరియా దేశాల నుంచి ఎక్కువగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తోంది. ఆయుధాల దిగుమతిలో భారత్‌ తర్వాత స్థానాలలో సౌదీ అరేబియా, ఈజిప్టు, యూఏఈ, చైనా, ఆస్ట్రేలియా, ఇరాక్, పాకిస్తాన్, ఇండోనేసియా నిలిచాయి. ఇక మన దేశానికి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశం రష్యా.. దేశానికి అవసరమయ్యే ఆయుధాల్లో రష్యా నుంచి 62శాతం, అమెరికా నుంచి 15 శాతం, ఇజ్రాయెల్‌ నుంచి 11 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. 

అమెరికా నుంచి 550 శాతం పెరిగిన దిగుమతులు 
ఒకవైపు పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. మరోవైపు డ్రాగన్‌ దేశం బుసలు కొడుతూ ఉంటుంది.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మన రక్షణ బడ్జెట్‌ క్రమంగా పెరిగిపోతోంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా తర్వాత రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నది భారత్‌ దేశమే. ఎప్పుడో ఏ దేశం నుంచి ముప్పు ఉంటుందో తెలీని పరిస్థితుల్లో మనం ఆయుధాలను దిగుమతి చేసుకోక తప్పడం లేదు.  సైనికులు వాడే తుపాకులు దగ్గర్నుంచి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, జలాంతర్గాములు వంటివి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటే, ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.  ఇక అమెరికా నుంచి రికార్డు స్థాయిలో 550శాతం దిగుమతులు పెరిగాయి. బోయింగ్‌ ఏపీ–8 పెసిడోన్‌ యాంటీ సబ్‌మెరైన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్, సీ–17 రవాణా విమానం,  ఏహెచ్‌–64ఈ అపాచి అటాక్‌  హెలికాప్టర్‌ల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. గత 15, 16 ఏళ్ల కాలంలో ఆయుధాల ఒప్పందం కోసమే 7,500 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇక 2018–19 సంవత్సరానికి 2.95 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. మరో 1.08 లక్ష కోట్లు రక్షణ రంగంలో పెన్షన్లకు కేటాయించారు. 

మేకిన్‌ ఇండియా ఫలితాన్ని ఇవ్వడం లేదా ?
మన రక్షణ రంగంలో ఆయుధాలన్నీ ఎప్పుడో తాతలకాలం నాటివి. అత్యంత పురాతన యుద్ధవిమానాలనే మనం ఇంకా వాడుతున్నాం. అందుకే రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి, యుద్ధవిమానాలు, జలాంతర్గాములు, తుపాకులు వంటివి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడానికి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.  మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమంతో ఆయుధాల తయారీ రంగంలో స్వయంప్రతిపత్తి సాధించడానికి ప్రణాళికలు రూపొందించింది.  ఇందుకోసం 25 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేయడానికి కూడా సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజాస్‌ వంటి యుద్ధ విమానాన్ని భారత్‌ రూపొందించినప్పటికీ దేశ అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఇంకా చేరుకోలేకపోయింది. 2014 తర్వాత  విదేశీ ఆయుధ కంపెనీలతో 1.3లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకుంటే, స్వదేశీ సంస్థలతో 1.17 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. 15 లక్షల మంది సాయుధ దళాల నిర్వహణకే అత్యధిక నిధులు ఖర్చు అయిపోతూ ఉండడంతో రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేకపోతోంది. అందుకే విదేశాల నుంచి ఆయుధాల దిగుమతి తప్పనిసరైపోతోంది. 

-- (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement