
'మోదీ గొప్పే.. కానీ నాకు ఇందిరానే ఇండియా'
న్యూఢిల్లీ: ఒకపక్క ప్రధాని నరేంద్రమోదీని కొనియాడుతూనే జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అంతకుమించి ఇందిరాగాంధీని కొనియాడారు. తనకు సంబంధించి భారత్ అంటే ఇందిరా అని సంచలన వ్యాఖ్యాల చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కశ్మీర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఫ్తీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ను భారత్‌ను వేరు చేసి ఓ టెలివిజన్ చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 'టీవీ చానెల్‌లో భారతదేశ చిత్రపటంగా దేన్నయితే చూపించిందో అది నాకు తెలిసిన భారత్ కాదు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి. భారత్, కశ్మీర్ వేరు కాదు' అని ఆమె అన్నారు.
భారత్‌లో ముస్లింలకు, హిందువులకు మధ్య ఎలాంటి భేదాలు ఉండవని, కలిసి ప్రార్థనలు చేసే సంప్రదాయం కూడా భారత్ సొంతం అన్నారు. 'నావరకు భారత్ అంటే ఇందిరాగాంధీ. నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు ఆమె ఆమె నాకు భారత్‌ను బహుకరించింది. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఆమె అంటే భారతదేశం. నేను మళ్లీ అలాంటి భారత్‌ను చూడాలని అనుకుంటున్నాను. కశ్మీర్ బాధను, కష్టాన్ని, ఏడ్పును తనదిగా భావించే భారత్ నేను మళ్లీ చూడాలని అనుకుంటున్నాను. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటం మూలం భారత్‌కు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మనది భిన్న సమాజం. ఇక్కడ భిన్న సంస్కృతులు ఉన్నాయి. కశ్మీర్ అంటే భారత్లోనే ఒక మినీ ఇండియా' అని ఆమె భావోద్వేగంతో చెప్పారు.