న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై శాస్త్రవేత్తలు మరో దుర్వార్తను వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ మహమ్మారి వ్యాప్తి నెమ్మదించినప్పటికీ.. వర్షాకాలంలో మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో, ఆ తరువాత కొన్ని వారాల పాటు వ్యాప్తి తగ్గినప్పటికీ జూలై చివరలో, ఆగస్టులో(వర్షాకాలంలో) మళ్లీ ఈ కేసులు విజృంభించే ప్రమాదముందని తెలిపారు. అది ఈ వైరస్ వ్యాప్తిలో రెండో దశగా భావించవచ్చన్నారు.
‘ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థిరీకరణ స్థాయిలో ఉంది. రానున్న రోజుల్లో అది ఇంకా తగ్గిపోవచ్చు. కాని కొన్ని వారాలు లేదా నెలల తరువాత కేసుల సంఖ్య పెరగొచ్చు’ అని శివనాడార్ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమిత్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ కూడా వ్యక్తం చేశారు. టీకా అందుబాటులోకి వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ వైరస్ మళ్లీ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఫ్లూ లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దని భట్టాచార్య సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం ఆపేయవద్దన్నారు.
కాగా, మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిస్తుండటం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్యలో ఆరు శాతం మాత్రమే వృద్ధి చోటుచేసుకుంది. గత నెల మార్చి తో పోలిస్తే ఇది అత్యంత తక్కువ కావడం విశేషం. దేశంలో 24 గంటల్లో కొత్తగా 1490 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 24,942కు చేరింది. మృతుల సంఖ్య 779కి పెరిగింది. మరణాల రేటు 3 శాతం కాగా, కోలుకున్న వారి సగటు 20 శాతంగా ఉంది. కరోనా బారిన నుంచి 5210 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.
అయితే, 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జలుబు మాదిరి కోవిడ్-19 సీజనల్ వ్యాధిగారూపుదిద్దుకునే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు సూచించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని అన్నారు. కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment