
పాక్ స్పందనపై ఆందోళన వద్దు..
న్యూఢిల్లీః పాకిస్తాన్ స్పందనపై భారత్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. జరిగేదంతా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని, పాకిస్తాన్ స్పందనను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని రిజిజు వ్యాఖ్యానించారు.
జమ్ము కశ్మీర్ లోని సైనిక శిబిరంపై దాడిచేసి 17 మంది సైనికుల హత్యకు.. 'తీవ్రవాద రాష్ట్రం' పాకిస్తాన్ కారణమన్న భారత్ ఆరోపణలను పాక్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రిజు సదరు వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ యూరీ పట్టణంలోని సైనిక శిబిరంపై దాడిఘటన విచారకరమని, అయితే జాగ్రత్తగా తమపని తాము చేసుకుపోతామని మంత్రి వెల్లడించారు.