‘మానవ అభివృద్ధి’ నామమాత్రం
సూచిలో భారత్‌కు 130వ ర్యాంకు
న్యూఢిల్లీ: మానవ అభివృద్ధి సూచిక(హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్-హెచ్‌డీఐ)లో భారత్ ఇంకా దిగువనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 130వ ర్యాంకు సాధించింది. మొత్తం 188 దేశాలకు సంబంధించి మానవ అభివృద్ధి నివేదిక 2015ను యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌డీపీ) సోమవారం విడుదల చేసింది. 2014 సంవత్సరానికి ఈ ర్యాంకులను విడుదల చేసింది. నివేదిక ప్రకారం భారత ర్యాంకు 131 నుంచి 130కి పెరిగింది. 2009 నుంచి 2014 వరకు మానవ అభివృద్ధి నివేదికను పరిగణనలోకి తీసుకుంటే భారత ర్యాంకు 6 స్థానాలు మెరుగుపడింది. 2014 సంవత్సరానికి భారత హెచ్‌డీఐ విలువ 0.609. దీంతో మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ కేటగిరీలో మనదేశానికి యూఎన్‌డీపీ చోటు కల్పించింది.
1980 నుంచి 2014 వరకూ పోలిస్తే.. భారత హెచ్‌డీఐ 0.362 నుంచి 0.609కి పెరిగింది. కాగా, ఈ నివేదికలో నార్వే అగ్రస్థానంలో నిలిస్తే.. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాలు సాధించాయి. బంగ్లాదేశ్ 142వ, పాకిస్తాన్ 147వ స్థానంలో నిలిచాయి. బ్రిక్స్ దేశాల జాబితాలో అతి తక్కువ ర్యాంకు సాధించిన దేశం మాత్రం భారతే. బ్రిక్స్‌లో ఇతర దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా మనకంటే ముందున్నాయి. ఆరోగ్యకరమైన జీవితం, విద్యా ప్రమాణాలు, మెరుగైన జీవన విధానానికి సంబంధించి యూఎన్‌డీపీ మానవ అభివృద్ధి ర్యాంకులను కేటాయిస్తుంది. ఇక మనిషి ఆయుర్దాయం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి 68 సంవత్సరాలకు చేరింది. అలాగే తలసరి స్థూల జాతీయ ఆదాయం(జీఎన్‌ఐ) 2013లో 5,180 డాలర్లుగా ఉంటే 2014లో అది 5,497 డాలర్లకు పెరిగింది.