సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైనా భారత్‌లో అతితక్కువగా కోవిడ్-19 కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో కేవలం 0.49 కరోనా మరణాలు సంభవిస్తుండగా, ప్రతి లక్ష మంది జనాభాలో అత్యల్పంగా 17.32 వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ఐదవ దేశంగా భారత్ నిలిచినా లక్ష మంది జనాభాలో ఇన్ఫెక్షన్ రేటు, మరణాల సంఖ్యలో మాత్రం పలు దేశాల కంటే చాలా మెరుగ్గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం జర్మనీలో ప్రతి లక్ష జనాభాకూ 219 కరోనా వైరస్ కేసులు నమోదవుతుండగా, ఇటలీలో 387, బ్రిటన్‌లో 419, స్పెయిన్‌లో 515 కేసులు నమోదవుతున్నాయి. ఇక లక్ష జనాభాకు బ్రిటన్‌లో 59 కోవిడ్-19 మరణాలు చోటుచేసుకోగా, స్పెయిన్‌లో 58, ఇటలీలో 55, జర్మనీలో 10 మంది చొప్పున కోవిడ్-19తో మృత్యవాతన పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 9971 తాజా కేసులు వెలుగుచూడగా మొత్తం పాజిటివ్ కేసులు 2,46,628కి ఎగబాకాయి. వైరస్ బారినపడి 287 మంది మరణించగా మృతుల సంఖ్య 6929కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక 1,19,293 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment