
సాక్షి, ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తీవ్రంగా మందగించినా... దేశంలోని 100 మంది ధనికులు ఆస్తులలో మాత్రం నాలుగో వంతు అభివృద్ధి కనిపించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. దేశంలోని 100 మంది ధనికుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ‘మందగించిన ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత సంపన్నులవుతున్న భారత సంపన్న దిగ్గజాలు’ అంటూ ఓ పరిశోధనాత్మక కథనాన్ని కూడా ఫోర్బ్స్ ప్రచురించింది.
నోట్ల రద్దు, జీఎస్‌టీలే కారణం
పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణమని తెలిపింది. ఈ రెండింటి వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగానే గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయి(5.7 శాతానికి) వృద్ధి రేటు దిగజారింది. దీంతో సంబంధం లేకుండా దేశంలోని సంపన్నుల ఆస్తులు 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని చూశాయి.
ఒక్క ఏడాది.. రూ. లక్ష కోట్లు..
దేశ ధనవంతుల్లో ముకేశ్ అంబానీ కొద్ది సంవత్సరాలుగా తొలిస్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్నారు. 2017లోనూ ఆయన కుబేరుడిగానే నిలిచారు. చమురు, గ్యాస్ వ్యాపారాల్లో ఈ ఏడాది ముకేశ్ లాభపడినట్లు ఏ ఇతర భారతీయ కంపెనీ లాభాలను ఆర్జించలేదు. దాదాపు రూ. లక్ష కోట్లకు పడగలెత్తి భారతీయుల్లో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు ముకేశ్. లాభాలతో కలిపి ముకేశ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 2.47 లక్షల కోట్లకు చేరినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.
అంతా జియో మహిమ..!
ముకేశ్ ఆస్తులు ఒక్కసారిగా లక్ష కోట్లు పెరగడానికి 'రిలయన్స్ జియో' ఓ కారణమని కూడా తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది ఫోర్బ్స్. రిలయన్స్ షేర్లు భారీగా పెరగడానికి జియోను కారణమని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment