చైనాపై భారత్ శాటిలైట్ నిఘా..!!
న్యూఢిల్లీ: చైనాకు పొరుగున ఉన్న దక్షిణ వియత్నాంలో భారత్ శాటిలైట్ ట్రాకింగ్, ఇమేజింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా భారత భూ పరిశీలన శాటిలైట్లు తీసే ఫొటోలను పొందే అవకాశం ఆ దేశానికి లభిస్తుంది. చైనా, వివాదాస్పద దక్షిణ సముద్రం సహా ఈ ప్రాంతమంతా భారత శాటిలైట్ల పరిధిలోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్ తలపెట్టిన ఈ చర్య చైనాను ఇరకాటంలో పడేసే అవకాశముంది. వ్యవసాయ, శాస్త్ర పరిశోధన, పర్యావరణ అంశాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఈ భూ పరిశీలన శాటిలైట్లను పౌర సేవల వసతిగా పేర్కొంటున్నప్పటికీ.. మెరుగైన ఇమేజింగ్ పరిజ్ఞానంతో ఇవి తీసే చిత్రాలు సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాతో వివాదం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో వియత్నాం తన నిఘా, గూఢచర్య, భూపరిశీలన సాంకేతికతను మరింత మెరుగుపరుచాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా చూస్తే ఆ దేశానికి ఈ చర్య ఎంతో కీలకమైనదని నేవీ భద్రత నిపుణుడు కొలిన్ కొహ్ తెలిపారు.
భారత్-వియత్నానికి ఇది సమాన లబ్ధిని కలిగించే అంశమని, భద్రతా లోపాలు పూడ్చుకోవడానికి వియత్నానికి, తన సామర్థాన్ని విస్తృతం చేసుకోవడానికి భారత్‌కు ఈ చర్య ఉపకరిస్తుందని సింగపూర్‌కు చెందిన రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో సేవలందిస్తున్న ఆయన వివరించారు. వరుస అంతరిక్ష విజయాలతో దూకుడు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 23 మిలియన్ డాలర్ల (రూ. 155 కోట్ల)తో హో చి మిన్హ్ నగరంలో ఈ శాటిలైట్ సమాచార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా భారత శాటిలైట్లు ఇస్రో పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రం ఇటు భారత్‌కు తన శాటిలైట్ల పర్యవేక్షణకు ఉపయోగపడగా, అటు వియత్నానికి ట్రాకింగ్ సైట్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇరుదేశాలూ దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ శాటిలైట్ సమాచార కేంద్రం అందించే ఫొటోలను వియత్నాం నిఘా, సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.