
మేథో హక్కుల్లో సహకారం
న్యూఢిల్లీ: సృజనాత్మకతను ప్రోత్సహించే దిశగా మేథో హక్కుల విషయంలో ఆచరణ సాధ్యమైన, పారదర్శక విధానం ఆవశ్యకతను భారత్, అమెరికాలు గుర్తించాయి. మేథో హక్కుల అంశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, అభ్యంతరాలను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. మేథోహక్కులను కాపాడే విషయంలో సమర్ధ విధానాల రూపకల్పన, సమాచార మార్పిడి, మేథో హక్కుల రక్షణలో సంబంధిత వర్గాల భాగస్వామ్యం.. తదితర అంశాల్లో పరస్పర సహకారం కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాృ్ ఒబామా పర్యటన సందర్భంగా ఆదివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇరుదేశాలకృ ప్రయోజనం చేకూరేలా మేథోహక్కుల అంశంపై ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం తదుపరి చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మేథోహక్కులకు, ముఖ్యంగా ఔషధ రంగ మేథో హక్కులకు సంబంధించిన భారతీయ చట్టాలు వివక్షాపూరితంగా ఉన్నాయన్న అమెరికా కంపెనీల విమర్శలు, భారతీయ చట్టాలు అంతర్జాతీయ, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయన్న భారత్ వాదనల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మేథో హక్కులకు సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించే కార్యక్రమాన్ని భారత్ ఇప్పటికే ప్రారంభించింది. ఒక ముసాయిదాను కూడా సిద్ధం చేసింది.