భారత్‌పై నేపాల్‌‌ అభ్యంతరం.. చైనా ప్రమేయం! | Indian Army Chief Comments Over Nepal Objection On New Road | Sakshi
Sakshi News home page

నేపాల్‌ అభ్యంతరం ఏమిటో: ఆర్మీ చీఫ్‌ నరవాణే

Published Fri, May 15 2020 7:58 PM | Last Updated on Sat, May 16 2020 3:42 AM

Indian Army Chief Comments Over Nepal Objection On New Road - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతంలో భారత్‌ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్‌ అభ్యంతరం లేవనెత్తడం వెనుక చైనా ప్రమేయం ఉన్నట్లు భారత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే సందేహం వ్యక్తం చేశారు. భారత్‌ పట్ల నేపాల్‌ నిరసన వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో తనకు అర్థంకావడం లేదన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే... వేరొకరి తరఫున ఆ దేశం వకాల్తా పుచ్చుకున్నట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో ఇదొక భాగమేనన్న సంకేతాలు ఇచ్చారు. కాగా భారత్‌- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్‌ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్‌ ప్రభుత్వం లిపులేఖ్‌ తమ భూభాగానికి చెందినదే అని ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబారికి నోటీసులు సైతం పంపింది.(భారత్‌, చైనాలతో చర్చించేందుకు సిద్ధం: నేపాల్‌)

ఇక ఈ విషయం గురించి నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ గ్యావాలి మాట్లాడుతూ... లిపూలేఖ్‌ నేపాల్‌, భారత్‌, చైనా ట్రై జంక్షన్‌లో ఉందని.. ఈ విషయం గురించి భారత్‌తో పాటు చైనాతో చర్చిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనోహర్‌ పారికర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జనరల్‌ నరవాణే.. ‘‘కాళీ నది తూర్పు ప్రాంతం నేపాల్‌లో ఉంది. భారత్‌ చేపట్టిన రహదారి నిర్మాణం నది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ విషయంలో వారికి అభ్యంతరం ఏముందో తెలియడం లేదు. వేరొకరి వాదనను వీరు వినిపిస్తున్నారేమో’’అని పేర్కొన్నారు. (తైవాన్‌పై చైనా పెత్తనం.. భారత్‌ సాయం కావాలి!)

అదే విధంగా ఇండో- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణ గురించి కూడా నరవాణే ఈ సందర్భంగా స్పందించారు. లఢఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్రంగా పరిగణించదగ్గవి కాదన్నారు.  రోజుకు పదిసార్లు ఇరు వర్గాలు తారసపడతాయని.. ఇలాంటి ఘటనలు అక్కడ సాధారణంగా జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కమాండర్లను మార్చినపుడు.. కొత్త వాళ్లతో గొడవకు దిగే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: చైనా స్పందన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement