సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇండియన్ ఆర్మీ ఆకాశంలో అద్భుతం సృష్టించనుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశమార్గాన భారీ బెలూన్‌లో సాహస ప్రయాణం చేసి రికార్డు నెలకొల్పబోతోంది. అందులో భాగంగా మంగళవారం ఇక్కడికి చేరుకున్న బృందం తిరిగి బుధవారం బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ అనిరుధ్ నేతృత్వంలో 60 మంది సైనికుల బృందం జమ్మూ–కశ్మీర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు భారీ బెలూన్‌లో ఆకాశయానాన సాహస ప్రయాణాన్ని గత నెల 6వ తేదీన ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ అనే అక్షరాలు రాసి ఉన్న రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ బెలూన్‌లో నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. ఈ కారణంగా నలుగురు సైనికులు బెలూన్‌లో ప్రయాణిస్తే మిగిలిన వారు రోడ్డు మార్గంలో వారిని అనుసరించారు.
నిర్ణీత ప్రయాణం చేసిన తరువాత బెలూన్ నేలపైకి దిగినపుడు అందులోని సైనికులు కిందకు దిగుతుండగా..మరో నలుగురు అందులో ఎక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జమ్మూ–కశ్మీర్ నుంచి ఆగ్రా, భోపాల్, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకున్నారు. చెన్నై నుంచి కాంచీపురానికి సమీపంలోని కురువిమలైలోని విమాన కంట్రోలు కార్యాలయం మైదానంలో మంగళవారం సాయంత్రం దిగారు. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలో దిగిన బెలూన్ చూసి పరిసరాల ప్రజలు ఆశ్చర్యంతో చుట్టూ చేరారు. సైనిక వీరులతో సెల్ఫీ దిగారు. ఇక్కడ కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి బుధవారం బయలు దేరారు. చెన్నై, తిరుచ్చిరాపల్లి, మదురై, శివకాశి, తిరునెల్వేలి మీదుగా ఈనెల 29వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సాహస ప్రయాణంలో ఆకాశమార్గాన 3,236 కిలోమీటర్లు, రోడు మార్గంలో 3,901 కిలోమీటర్లు పయనించినట్లవుతుందని వారు తెలిపారు.
Published Thu, Dec 20 2018 10:39 AM | Last Updated on Thu, Dec 20 2018 12:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment