
న్యూఢిల్లీ: రూ. 40 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్‌ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 40 వేల కోట్లు అవసరమవుతుందని లెక్కగట్టింది. సరిహద్దులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కేంద్రానికి ఆర్మీ విజ్ఞప్తి చేసింది.
దీంతో రక్షణ శాఖ నుంచి ఈ కొనుగోలు ప్రక్రియకు ముందడుగు పడింది. ఈ కొనుగోలు ప్రణాళిక కాకుండా ఎల్‌ఎంజీ తరహా చిన్న ఆయుధాలను వీలయినంత త్వరగా సిద్ధం చేసి ఆర్మీకి అందించాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త 7.62 మి.మీ. అసాల్ట్ రైఫిల్ ప్రత్యేకతలను ఆర్మీ సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపగా వాటికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో 7 లక్షల 7.62గీ51 ఎంఎం అసాల్ట్ గన్లను ఇవ్వాలని ఆర్మీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment