సర్జికల్‌ దాడులకు వీడియో సాక్ష్యం..! | Indian Army Surgical Strikes Video Out | Sakshi
Sakshi News home page

వైరల్‌ : భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియో..!

Published Thu, Jun 28 2018 9:16 AM | Last Updated on Thu, Jun 28 2018 9:57 PM

Indian Army Surgical Strikes Video Out - Sakshi

పీవోకేలోని ఉగ్ర స్థావరం

న్యూఢిల్లీ : దాదాపు రెండేళ్ల క్రితం (దాదాపు 636 రోజుల కిందట) పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడులు (సర్జికల్‌ స్ట్రయిక్స్‌)   వీడియోలు తాజాగా  విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన ‘టెర్రర్‌ లాంచ్‌ఫాడ్‌’లను ధ్వంసం చేసిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా భావిస్తున్నారు. 

కశ్మీర్‌ బారాముల్లాలోని ఉడి సైనికస్థావరంలోకి జొరపడిన ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను మట్టుపెట్టారు. దీనికి ప్రతీకారంగా సరిగ్గా 11 రోజుల తర్వాత భారత సైనికులు మెరుపుదాడుల ద్వారా తమ సత్తా చాటారు. 2016 సెప్టెంబర్‌ 28వ తేదీ అర్థరాత్రి, 29వ తెల్లవారు జాములోగా ముగించిన ఈ దాడులకు సంబంధించిన  నాలుగు వీడియోలున్నాయి.

ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్న విపక్షాలు...
2016లో జరిగిన దాడులను  ఓటుబ్యాంక్‌గా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం తాజాగా వీడియోలు విడుదల చేసిందని  కాంగ్రెస్‌ విమర్శించింది.సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నుంచి ఓట్లరూపంలో ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ధ్వజమెత్తారు. గతంలో సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు మద్దతు తెలిపిన ఎన్డీఏ మిత్రపక్షం జేడీ(యూ) కూడా అప్పటి మెరుపుదాడులతో ఏమి సాధించారని ప్రశ్నించింది.  ఇప్పుడు వీడియోలు బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని  మాజీ మంత్రి అరుణ్‌శౌరీ ప్రశ్నించారు.  సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వీడియోపై  కాంగ్రెస్‌ స్పందన పాకిస్తాన్‌ టెర్రరిస్టులను ప్రోత్సహించేదిగా ఉందంటూ  కేంద్రమంత్రి  రవిశంకర్‌ప్రసాద్‌ విరుచుకుపడ్డారు. 

అసలప్పుడేం జరిగింది ?
పాక్‌ ఆక్రమిత ప్రాంతంలోని ఎంచుకున్న ఉగ్రవాద  లక్ష్యాల గురించి వివరించే పటంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దాడిలో పాల్గొన్న సైనికులకు అమర్చిన కెమెరాలు, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలు, అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికిల్స్‌ (యూఏవీ) ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులను చిత్రీకరించారు. దాడులకు ముందు, ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా తెలిసేలా రికార్డ్‌ చేశారు. ఈ కెమెరాల ద్వారా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి, ఆ తర్వాత రాకెట్‌ లాంఛర్లు, యాంటీ బంకర్‌ మిసైల్స్‌ని ప్రయోగించి పాక్‌ టెర్రర్‌ బంకర్లు ధ్వంసం చేయడాన్ని మొదటి వీడియోలో చిత్రీకరించారు. 

రెండు నిముషాల వ్యవధిలోనే రెండో లక్ష్యంపై దాడి చేయడాన్ని యూఏవీల ద్వారా రికార్డ్‌ చేశారు.   మరో 20 సెకన్ల వ్యవధిలోనే జరిపిన దాడిలో ఉగ్రవాదుల బంకర్‌ ధ్వంసం కావడాన్ని కెమెరాల్లో బంధించారు. ఈ విధంగా మొత్తం 8 దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతం కావడం కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జమ్ము,కశ్మీర్‌ సరిహద్దులోని ఆధీనరేఖ (ఎల్‌ఓసీ)కు కొన్ని కి.మీ లోపలికి వెళ్లి పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు నెలమట్టం చేయడానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌ భూభాగంలోని ఈ స్థావరాల్లో తీవ్రవాదులు, సైనికులు కలగలిసి స్వేచ్ఛగా తిరగడం ఈ వీడియోల్లో రికార్డయింది. దాడి జరిగిన తేదీ, సమయం కూడా వీడియోల్లో స్పష్టంగా నమోదైంది. 

గతంలోనూ ‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌’...
గత రెండుదశాబ్దాల్లో పలు సందర్భాల్లో మెరుపుదాడులు జరిగాయని కాంగ్రెస్‌ నేత సుర్జేవాలా వెల్లడించారు. ఆ జాబితా ఇదే...
–2000 జనవరి 21న నీలం నది వ్యాప్తంగా  నడాలా ఎన్‌క్లేవ్‌లో...
–2003 సెప్టెంబర్‌ 18న ఫూంచ్‌లోని బారా సెక్టర్‌లో...
–2008 జూన్‌ 19న ఫూంచ్‌లోని భట్టల్‌ సెక్టర్‌లో...
–2011 సెప్టెంబర్‌ 1న నీలంనది లోయలోని కెల్‌ (శారద సెక్టర్‌) ప్రాంతంలో...
–2013 జనవరి 6న  సావన్‌ పత్ర చెక్‌పోస్ట్‌...
–2013 జులై 27–28 తేదీల్లో నజాపిర్‌ సెక్టర్‌లో...
–2013 ఆగస్టు 6న నీలం లోయలో...
–2014 జనవరి 14న మరో మెరుపు దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement