అసోంలో కొట్టుకుపోయి.. బంగ్లాదేశ్‌లో మృతి
అసోంలో బ్రహ్మపుత్రా నదికి భారీగా వరదలు రావడంతో అందులో సుమారు 50 రోజుల క్రితం కొట్టుకుపోయింది.. చివరకు బంగ్లాదేశ్‌లో తేలి, అక్కడ చనిపోయింది. అవును.. మన దేశానికి చెందిన ఏనుగు బంగ్లాదేశ్‌లో చనిపోయింది. 'బంగబహదూర్' అనే పేరున్న ఈ ఏనుగును ఢాకా సమీపంలోని సఫారీ పార్కుకు తరలించేందుకు వన్యప్రాణి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాన్ని కాపాడేందుకు తాము చాలా ప్రయత్నించినా అది బతకలేదని బంగ్లాదేశ్ అటవీ శాఖాధికారులు చెప్పారు. అయితే ఆ ఏనుగు మృతికి సరైన కారణం తెలుసుకునేందుకు దానికి అటాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ఏనుగు బాగా నీరసంగా ఉందని.. అసోంలోని ధుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకుపోయిందని చెబుతున్నారు.
ఏనుగు చనిపోయిన విషయం తెలిసి ఇటు అసోంతో పాటు అటు బంగ్లాదేశ్‌లో కూడా పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 11వ తేదీన బంగ్లాదేశ్‌లో దానికి అటవీ శాఖాధికారులు మత్తుమందు ఇచ్చారు. ఒక కొలనులో ఉన్న ఆ ఏనుగును తాళ్లు, చైన్లతో బయటకు లాగి మునిగిపోకుండా చూసేందుకు ప్రయత్నించారు. ఆదివారం వరకు అది బాగానే ఉందని, కానీ చివరకు చనిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏనుగులు అంత వేడిని భరించలేవని.. దానికి తాము సాధారణంగా ఇచ్చే ఆహారమే ఇచ్చి బతికించేందుకు ప్రయత్నించినా అది బతకలేదని మరో అధికారి చెప్పారు.