brahmaputra floods
-
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్‌లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
ఉత్తమనటి..బ్రహ్మపుత్రిక
బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే ఆ గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావు. వరదలు రావడం, గ్రామం కొట్టుకుపోవడం యేటా మామూలే. ఇక ఆ గ్రామానికి, మిగతా ప్రపంచానికీ రాకపోకల కోసం ఒక్క వంతెనైనా లేదు. అలాంటి గ్రామానికి రెండేళ్ల క్రితం ఒక మంచి ‘సంబంధం’ కోసం నానా కాలి బాటల్లో పడి ఒక బృందం వచ్చింది! ఇంటి పని, పొలం పనీ చేయగలదు అనిపించిన 20 ఏళ్ల శివరాణి అనే మొరటు పిల్లను చూసి మరీ ఎంపిక చేసుకుంది. ఆ వచ్చిన వాళ్లు సినిమా వాళ్లు! వారి సినిమా ‘బ్రిడ్జ్’లో నటించిన ఆ బ్రహ్మపుత్రిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటి! నదికి, నది ఒడ్డున నివాసం ఉన్నవారికి మధ్య ‘బాంధవ్యం’ ఎలా ఉంటుంది? ముంచెత్తే వరదలు సైతం విడదీయలేనంత బలంగా ఉంటుంది. అస్సామీలో వచ్చిన ‘బ్రిడ్జ్’ సినిమా కథాంశం ఈ బాంధవ్యమే. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం వైపున బలిగావ్ అనే గ్రామం ఉంది. అస్సాంలోని లఖింపూర్ జిల్లా పరిధిలోని ధకువాఖన సబ్–డివిజన్ కిందికి వస్తుంది ఆ గ్రామం. వరదలు వస్తే అసలే లేకుండా పోతుంది! బ్రహ్మపుత్రకు ఏటా వరదలు తప్పవు. బలిగావ్ గ్రామానికి ముంపు తప్పదు. వరద తగ్గుముఖం పట్టాక, సూర్యుడు మేఘాల్లోంచి పైకి వచ్చిన విధంగా ఊళ్లోంచి వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ ఒడ్డున ఉదయిస్తారు. పడిపోయిన ఇళ్లను పునర్నించుకుంటారు. అంతే తప్ప ఊపిరి లాంటి ఆ ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఊరు నదితో బాంధవ్యం కలుపుకుందనే ఆ ఒక్క కారణంతో ఆ ఊరితో పొరుగూళ్లవారెవరూ సంబంధం కలుపుకోరు! ఇంకో కారణం కూడా ఉంది. బలిగావ్కు మిగతా ప్రాంతాలను కలిపే వంతెన లేదు. అలాంటి చోటుకు పిల్లను ఎలా ఇస్తారు? అక్కడి పిల్లను ఎలా తెచ్చుకుంటారు? ఇదంతా సినిమాలో అంతర్లీనంగా ఉండే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది చిత్ర కథ కాదు. ఆ చిత్రంలో ‘జానకి’ ప్రధాన పాత్ర పోషించిన అస్సామీ యువతి శివరాణి కథ. ‘బ్రిడ్జ్’ చిత్రం 2020 లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి 28 అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు వచ్చాయి. తాజాగా కెనడాలో జరిగిన ‘అట్టావా నాల్గవ భారత చలన చిత్రోత్సవం’లో శివరాణిని ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది. ∙∙ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ జరిగే సమయానికి శివరాణి వయసు 22. ఆ సినిమాకు కథానాయిక గా ఆమె దొరికి, సినిమా పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. 89 నిముషాల ఈ చిత్రాన్ని తియ్యడానికి డైరెక్టర్ కృపాల్ కాళిత సహా టీమ్ మొత్తం దాదాపుగా ప్రతిరోజూ నీటిలోకి దిగవలసి వచ్చేది. రెండు నిముషాల సీన్ షూటింగ్‌కి ఎనిమిది గంటల సమయం పట్టిన అనుభవం కూడా వారికి ఉంది. నీళ్లలోకి దిగడం, కరెక్ట్ షాట్ కోసం గంటలు గంటలు పనిచేయడం పెద్ద కష్టమైతే కాలేదు కానీ, జానకి పాత్రకు శివరాణిని వెతికి పట్టుకోవడమే వారికి కష్టమైంది. వాళ్లకు కావలసింది చూడ్డానికి మొరటుగా, పొలం పనుల వల్ల చేతుల కాయలు కాసి ఉన్న అమ్మాయి. అలాగే ఆమెకు పొలం దున్నడం తెలిసుండాలి. పశువులు మేపగలగాలి. ఈ ‘క్వాలిటీ’లన్నిటి కోసం బలిగావ్ గ్రామం మొత్తం గాలించి 300 మంది యువతులకు ఆడిషన్ నిర్వహించి చివరికి శివరాణిని ఎంపిక చేసుకున్నారు. కథకు, కథనానికి సరిపోయేలా ఉంది శివరాణి. ఫ్రెష్‌గా కాలేజ్ నుంచి వచ్చినప్పటికీ, అప్పుడే నాగలి పట్టి పొలం దున్ని ఇంటికి వచ్చినట్లుగా ఉంది. సినిమాకు అంతవరకు చాలు. అయితే ఆమె వదనంలో లీలగా విషాదం కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు వరదల్లో చనిపోయారు. తమ్ముడు, తను.. ఇద్దరే మిగిలారు. తమ్ముణ్ణి చదివిస్తూ, తన బి.యస్సీ పూర్తిచేసుకుని ఉన్న సమయంలో ఊళ్లోకి ఈ సినిమా టీమ్ వచ్చింది. వారి సినిమాలోని ప్రధాన పాత్రకు తను ఎంపికైన వార్త వినగానే శివరాణి ఎలాగైతే మేఘాలలో తేలిపోయిందో.. ఆ పాత్రకు ఉత్తమ నటిగా తనకు అవార్డు వచ్చిందని తెలిసి ఇప్పుడూ అంతే ఆనందంలో మునిగిపోయింది. ముంచడం, తేల్చడం బ్రహ్మపుత్ర యేటా చేస్తుండే పనే. ఈ మునగడం, తేలడం మాత్రం ఆమెకు కొత్త అనుభవం. సీమా బిస్వాస్ తర్వాత ఉత్తమ నటి అవార్డు పొందిన మరొక అస్సామీ నటి శివరాణి. 2019లో ఇదే ‘అట్టావా’ చిత్రోత్సవంలో మలయాళీ చిత్రం ‘ఇదం’కి ఉత్తమ నటి అవార్డు పొందారు సీమ. ఈ ఏడాది అదే చిత్రోత్సవంలో ‘బ్రిడ్జ్’తో శివరాణి ఉత్తమ నటి అయింది. 56 ఏళ్ల విలక్షణ నటితో తనకు పోలిక రావడం కూడా శివరాణిని ఆనంద డోలికల్లో విహరింపజేస్తోంది. తండ్రే ఆమెకు నాగలితో పొలం దున్నడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే సినిమాలో పొలం దున్నుతూ కనిపిస్తున్న తనను చూసి, ఆయనతో పాటు తల్లీ సంతోషించే ఉండేవారని శివరాణి అంటోంది. ప్రస్తుతం ఆమె తన గ్రామానికి దగ్గరగా ఉండే ఉత్తర లక్ష్మీపూర్‌లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లో సూపర్వైజర్గా పని చేస్తోంది. -
డోక్లాం తర్వాత మరో వివాదం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య రెండు నెలలకుపైగా డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భూటాన్‌కు మద్దతుగా భారత్ నిలవటం.. చైనా దుందుడుకు చేష్టలు.. ప్రతిగా భారత్ దళాలు ముందుకు దూసుకుపోవటం... ఇలా దాదాపు ట్రై జంక్షన్ వద్ద పరిస్థితులు యుద్ధ వాతావరణాన్నే తలపించాయి. చివరకు అంతర్జాతీయ సమాజం చొరవతో దౌత్యం ద్వారానే సమస్యను భారత్ సామరస్యంగా పరిష్కరించగలిగింది. అయితే రానున్న రోజుల్లో మరో సమస్య ద్వారా ఇరు దేశాల మధ్య వివాదం రాజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే నదుల సమస్య. ఎగువన ఉన్న బ్రహ్మపుత్ర, సట్లేజ్ నదులు చైనా గుండానే మన దేశంలో ప్రవహిస్తున్నాయి. అయితే ఆయా నదులకు వరదలు వచ్చే సమయంలో అప్రమత్తత చేయాల్సిన బాధ్యత చైనాదే. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల క్రితమే కీలక ఒప్పందం కూడా జరిగింది. మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య ముఖ్యంగా వర్షకాల సమయంలో బీజింగ్ వాతావరణ శాఖ ఇచ్చే సమాచారమే మనకు ముఖ్యం. కానీ, డోక్లాం వివాద నేపథ్యంలో చైనా గత కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం ఇవ్వటంలేదు. ఈ ఏడాది సరిగ్గా అదే సమయంలో డోక్లాం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో చైనా ఆ పని చేయలేదు. దీంతో బ్రహ్మపుత్ర నదికి సంభవించిన వరదల్లో 160 మంది అస్సాంలో మృతి చెందగా. రాష్ట్రంలోని 29 జిల్లాలు అతలాకుతలం అయి భారీగా నష్టం సంభవించింది. మరోవైపు సట్లేజ్ నదికి వచ్చిన వరదల్లో పంజాబ్‌లో 10 వేల ఎకరాల పంట భూమి నాశనం అయ్యింది. చైనా చెప్పేది నమ్మొచ్చా? దీనిపై బీజింగ్ వర్గాలు స్పందించాయి. హైడ్రోలాజికల్ డేటాను అందించకపోవటానికి కారణాలు వివరిస్తున్నాయి. టిబెట్ ప్రాంతంలో నెలకొల్పిన వరద గుర్తింపు కేంద్రాలు వరదల దాటికి నాశనం కావటంతోనే న్యూఢిల్లీ కేంద్రానికి సరైన సమాచారం అందించలేకపోయామని.. పునరుద్ధరణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయో ఖచ్ఛితంగా చెప్పలేమని గెంగ్ షువాంగ్ అనే అధికారి తెలిపారు. అయితే మనతోపాటే ఒప్పందం చేసుకున్న బంగ్లాదేశ్‌కు మాత్రం చైనా పక్కా సమాచారం అందించటంతో .. డ్రాగన్ దేశం కావాలనే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై వివాదం తలెత్తే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. -
అసోంలో కొట్టుకుపోయి.. బంగ్లాదేశ్‌లో మృతి
అసోంలో బ్రహ్మపుత్రా నదికి భారీగా వరదలు రావడంతో అందులో సుమారు 50 రోజుల క్రితం కొట్టుకుపోయింది.. చివరకు బంగ్లాదేశ్‌లో తేలి, అక్కడ చనిపోయింది. అవును.. మన దేశానికి చెందిన ఏనుగు బంగ్లాదేశ్‌లో చనిపోయింది. 'బంగబహదూర్' అనే పేరున్న ఈ ఏనుగును ఢాకా సమీపంలోని సఫారీ పార్కుకు తరలించేందుకు వన్యప్రాణి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాన్ని కాపాడేందుకు తాము చాలా ప్రయత్నించినా అది బతకలేదని బంగ్లాదేశ్ అటవీ శాఖాధికారులు చెప్పారు. అయితే ఆ ఏనుగు మృతికి సరైన కారణం తెలుసుకునేందుకు దానికి అటాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ఏనుగు బాగా నీరసంగా ఉందని.. అసోంలోని ధుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఏనుగు చనిపోయిన విషయం తెలిసి ఇటు అసోంతో పాటు అటు బంగ్లాదేశ్‌లో కూడా పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 11వ తేదీన బంగ్లాదేశ్‌లో దానికి అటవీ శాఖాధికారులు మత్తుమందు ఇచ్చారు. ఒక కొలనులో ఉన్న ఆ ఏనుగును తాళ్లు, చైన్లతో బయటకు లాగి మునిగిపోకుండా చూసేందుకు ప్రయత్నించారు. ఆదివారం వరకు అది బాగానే ఉందని, కానీ చివరకు చనిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏనుగులు అంత వేడిని భరించలేవని.. దానికి తాము సాధారణంగా ఇచ్చే ఆహారమే ఇచ్చి బతికించేందుకు ప్రయత్నించినా అది బతకలేదని మరో అధికారి చెప్పారు.