న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో భారతీయ రైల్వే తనవంతు పాత్ర పోషిస్తుంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 5,231 రైల్వే కోచ్‌లను కోవిడ్ బాధితుల కోసం అందుబాటులో ఉంచడానికి సిద్ధమైంది. తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న బాధితులకు కోచ్‌లలో చికిత్స అందించేలా వాటిని రూపొందించింది. ప్రస్తుతానికి ఐదు రాష్ట్రాల పరిధిలో 960 కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఢిల్లీలో 503, ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 60, ఉత్తరప్రదేశ్‌లో 372, మధ్యప్రదేశ్‌లో 5 ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా.. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ కోచ్‌లను ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సాయం అందించడం కోసం ప్రతి కోచ్‌కు ఇద్దరు అధికారులను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. కోచ్‌ల లోపలు ఉష్ణోగ్రతలను నియత్రించేందుకు వీలుగా అన్ని రకాలు చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. కరోనా బాధితుల సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం రైల్వే శాఖ అన్ని విధాల సాకారం అందజేస్తుందని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ మే 6వ తేదీన జారీచేసిన ప్రమాణాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులు, వైద్య సిబ్బందిని అందించాల్సి ఉంటుందని తెలిపింది.
ఢిల్లీకి కేటాయించిన కోచ్‌లను తొమ్మిది ప్రాంతాల్లో ఉంచారు. అధిక సంఖ్యలో ఆనంద్ విహార్ ప్రాంతంలో 267 కోచ్‌లను అందుబాటులో ఉంచినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీకి కేటాయించిన 20 కోచ్‌లను విజయవాడలో ఉంచారు. తెలంగాణకు కేటాయించిన 60 కోచ్‌లను.. సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కేంద్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment