రైల్వే ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్లు
న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భర్తీకాని సీట్లను నింపేందుకు రైల్వే శాఖ గురువారం తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. రిజర్వేషన్ చార్ట్ తుది ఖరారు అనంతరం మిగిలిపోయే సీట్లపై బేసిక్ చార్జీలో 10 శాతం తగ్గింపునిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఏసీ, స్లీపర్ క్లాస్‌తో సహా అన్ని రిజర్వ్ సీట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని, జనవరి 1, 2017 నుంచి ఆరు నెలలు పాటు తగ్గింపు కొనసాగుతుందని తెలిపింది.
రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో తాత్కాల్ కోటాలో 10 శాతం సీట్లు తగ్గించినట్టు వెల్లడించింది. రెండు వారాలకొకసారి తాత్కాల్ కోటాపై జోనల్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ సమీక్ష జరుపుతారని, ఒకవేళ తాత్కాల్ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటే 30 శాతం వరకు పెంచుతారని వివరించింది. న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, మైసూర్-చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో రూ. 140 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.