
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఒక పదానికి అర్థం తెలుసుకోవడానికి గూగుల్‌లో మనోళ్లు తెగ వెతికారు. 'ఆత్మనిర్భర్' అంటే ఏమిటి? అంటూ గూగుల్‌లో శోధించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. (రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ)
ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ‘ఆత్మ నిర్భర్’కు అర్థం కోసం గూగుల్‌లో చాలా మంది వెతికారు. కర్ణాటక, తెలంగాణ వాసులు ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ట్రెండ్స్ బట్టి వెల్లడైంది. మహారాష్ట్ర, గుజరాతీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గూగుల్ మాత్రమే కాదు, చాలా మంది తక్షణ సమాధానాల కోసం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కూడా ఆశ్రయించారు. ‘ఆత్మ నిర్భర్ అంటే ఏమిటి? సమాధానం చెప్పండి ప్లీజ్’ అంటూ అడిగారు. ఆత్మ నిర్భర్ అంటే స్వావలంభన అని అర్థం. స్వావలంబన దిశగా దేశం అడుగులు వేయడానికి ఆర్థిక ప్యాకేజీ ఊతమిస్తుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించాలని ఆయన కోరారు. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. )