
ట్రయల్స్‌లో భాగంగా టార్పిడోను ప్రయోగిస్తున్న స్కార్పిన్ తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ కల్వరి
న్యూఢిల్లీ : మహా సాగరంలో ఐఎన్‌ఎస్ కల్వరి అద్భుత విన్యాసాల వీడియోను భారతీయ నేవీ విడుదల చేసింది. జల ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగరంలో కల్వరి ట్రయల్స్‌ను విడుదల చేస్తున్నట్లు నేవీ పేర్కొంది. భారత్ అమ్ములపొదిలో ఉన్న నాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్లలో కల్వరి అత్యంత శక్తిమంతమైనది.
ఫ్రాన్స్ దేశం డిజైన్ చేసిన స్కార్పిన్ తరగతికి చెందిన కల్వరిని ఈ నెల ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేవీలోకి కమిషన్ చేసి, జాతికి అంకితం చేశారు. వాస్తవానికి కల్వరిని 1967లో నేవీలోకి కమిషన్ చేశారు. 30 ఏళ్ల సేవల అనంతరం 1996 మే 31న కల్వరిని నేవీ డీ కమిషన్ చేసింది. అయితే, ప్రాజెక్టు -75లో భాగంగా ఆరు స్కార్పిన్ తరగతికి చెందిన సబ్‌మెరైన్‌లను డిజైన్ చేసేలా ఫ్రాన్స్-భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
దీంతో వాటి శ్రేణిలో వచ్చిన తొలి సబ్‌మెరైన్‌కు ‘కల్వరి’ అని నామకరణం చేశారు. 2015లో ట్రయల్స్ కోసం తొలిసారి కల్వరి జల ప్రవేశం చేసింది. కల్వరికి 50 పూర్తి కావడంతో ట్రయల్స్‌లో అది చేసిన అద్భుతాలను నేవీ విడుదల చేసిన వీడియోలో చూపింది. సముద్ర లోతుల్లో తిరుగులేని చేపగా పేరున్న టైగర్ షార్క్‌ను దృష్టిలో పెట్టుకుని కల్వరి అనే పేరును పెట్టారు.
డిజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడిచే కల్వరి అతి తక్కువ శబ్దం చేస్తూ శత్రువుల రేడార్‌కు దొరకదు. అంతేకాకుండా కల్వరి సముద్ర అంతర్భాగం నుంచి ఉపరితలం మీదుగా క్షిపణులను ప్రయోగించగలదు. 2020 కల్లా ప్రాజెక్టు - 75 కింద రూపొందే సబ్ మెరైన్లు అన్ని నేవీ చేతికి అందనున్నాయి.