దిమాపూర్: నాగాలాండ్‌లో గురువారం ఓ అత్యాచార నిందితుడిని కొట్టిచంపిన జనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ ఆందోళనకారుల్లో ఒకరు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దిమాపూర్ సెంట్రల్ జైల్లోంచి ఫరీద్ ఖాన్ అనే నిందితుడిని ప్రజలు లాక్కొచ్చి కొట్టిచంపడం, ఈ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డం తెలిసిందే. ఈ ఉదంతంపై కేంద్రం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. నాగా యువతిపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఫరీద్ ఖాన్‌ను అస్సాం వాసిగా భావిస్తుండడంతో ఆ రాష్ట్రంలోనూ అప్రమత్తత ప్రకటించింది.
ఈ ఉదంతంపై నాగా ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యారంటూ దిమాపూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిప్యూటీ కమిషనర్‌లను సస్పెండ్ చేసింది. నిందితుడిని లాక్కొచ్చి, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కూడా నిర్ణయించింది. ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. నిందితుడి కుటుంబానికి పరిహారం ఇస్తామని సీఎం తెలిపారు. మరోపక్క.. దిమాపూర్ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నా అదుపులోనే ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. జైల్లో భద్రతా సిబ్బంది తక్కువగా ఉండడం, ఆందోళనకారుల్లో చాలామంది స్కూలు విద్యార్థులు ఉండడంతో దాడిని అరికట్టలేకపోయామని సస్పెన్షన్‌కు ముందు ఎస్పీ మెరెన్ జమీర్ తెలిపారు. ఈ ఉదంతానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పానని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.