మణి కేసులో ముమ్మర దర్యాప్తు
తిరువనంతపురం: మళయాల నటుడు కళాభవన్ మణి శరీర అవయవ నమూనాల్లో క్రిమిసంహారక మందు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు తేల్చిన నేపథ్యంలో.. ఆయన మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మణి కుటుంబసభ్యులు కోరితే అత్యున్నతస్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ సీఎం ఊమెన్ చాందీ తెలిపారు. రక్తం కక్కుకుని ఆస్పత్రిలో చేరిన ఈ నటుడు ఈ నెల 6న మృతి చెందిన సంగతి తెలిసిందే.
తొలుత కాలేయ, కిడ్నీ అనారోగ్యాన్నే కారణంగా భావించిన వైద్యవర్గాలు.. మరింత స్పష్టత కోసం మణి నమూనాలను కోచిలోని కక్కనాడ్‌లో రీజనల్ కెమికల్ ఎగ్జామినర్ ల్యాబొరేటరీకి పంపగా.. ఆయన అవయవాల నమూనాలలో అత్యంత ప్రమాదకరమైన ‘క్లోరిపైరిఫోస్’, మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ తదితర క్రిమిసంహారక మందులు ఉన్నాయని శుక్రవారం తేలింది. ఈ నేపథ్యంలో.. ‘మరణానికి ముందు మణి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. నా సోదరునికి మద్యం ఇచ్చిన స్నేహితులపై అనుమానంగా ఉంది.. వారిని అరెస్టు చేసి విచారించాల’ని మణి సోదరుడు రామకృష్ణన్ కోరారు.
మణి అవుట్‌హౌస్‌లో పోలీసుల సోదా
మణి అవుట్ హౌస్‌లో సోదా చేసిన పోలీసులకు అక్కడ కొన్ని పురుగుమందులు లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీటిని ల్యాబ్ పరీక్షకు పంపి.. మణి శరీర అవయవాల్లో లభించిన మందులా కాదా అన్నది తేల్చుకోనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.