Kerala CM Oommen Chandy
-
ఆ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
తిరువనంతపురం: కొల్లాం పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేళర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కోరారు. బుధవారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఊమెన్ చాందీ అన్నారు. వైద్యశాఖ మంత్రి శివకుమార్ నేతృత్వంలోని ఉపసంఘం గురువారం ఘటనా స్థలంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనను పలువురు రాజకీయం చేస్తున్నారని చాందీ మండిపడ్డారు. దుర్ఘటనకు సంబంధించి ఫైర్ వర్క్స్ కాంట్రాక్టర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. కాళికాదేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా పేలి 113మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాద ఘటనలో గాయపడ్డ వందలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
మణి కేసులో ముమ్మర దర్యాప్తు
తిరువనంతపురం: మళయాల నటుడు కళాభవన్ మణి శరీర అవయవ నమూనాల్లో క్రిమిసంహారక మందు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు తేల్చిన నేపథ్యంలో.. ఆయన మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మణి కుటుంబసభ్యులు కోరితే అత్యున్నతస్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ సీఎం ఊమెన్ చాందీ తెలిపారు. రక్తం కక్కుకుని ఆస్పత్రిలో చేరిన ఈ నటుడు ఈ నెల 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. తొలుత కాలేయ, కిడ్నీ అనారోగ్యాన్నే కారణంగా భావించిన వైద్యవర్గాలు.. మరింత స్పష్టత కోసం మణి నమూనాలను కోచిలోని కక్కనాడ్లో రీజనల్ కెమికల్ ఎగ్జామినర్ ల్యాబొరేటరీకి పంపగా.. ఆయన అవయవాల నమూనాలలో అత్యంత ప్రమాదకరమైన ‘క్లోరిపైరిఫోస్’, మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ తదితర క్రిమిసంహారక మందులు ఉన్నాయని శుక్రవారం తేలింది. ఈ నేపథ్యంలో.. ‘మరణానికి ముందు మణి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. నా సోదరునికి మద్యం ఇచ్చిన స్నేహితులపై అనుమానంగా ఉంది.. వారిని అరెస్టు చేసి విచారించాల’ని మణి సోదరుడు రామకృష్ణన్ కోరారు. మణి అవుట్హౌస్లో పోలీసుల సోదా మణి అవుట్ హౌస్లో సోదా చేసిన పోలీసులకు అక్కడ కొన్ని పురుగుమందులు లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీటిని ల్యాబ్ పరీక్షకు పంపి.. మణి శరీర అవయవాల్లో లభించిన మందులా కాదా అన్నది తేల్చుకోనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
‘శబరిమల’లో జోక్యం చేసుకోం
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప దేవాలయ సంప్రదాయాలు, నిబంధనల విషయంలో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం తెలిపారు. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను అనుమతించకూడదన్న నిబంధనను సుప్రీం కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై కేరళ ప్రభుత్వం తన వైఖరిని ఖరారు చేసింది. ఆలయ సంప్రదాయాలు, నిబంధనలలో తాము జోక్యం చేసుకోరాదని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేస్తామని కూడా వెల్లడించింది.