![Interpol issues Red Corner Notice against jeweller Nirav Modi in PNB scam - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/3/NIRAV-2-1.jpg.webp?itok=OhO9xZ_q)
నీరవ్ మోదీ
న్యూఢిల్లీ: దాదాపు 13 వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని సోదరుడు నిశాల్ మోదీ, ఆ కంపెనీ ఉద్యోగి సుభాష్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. రెడ్‌కార్నర్ నోటీసుల జారీ నేపథ్యంలో అంతర్జాతీయ నిఘా విభాగాల కళ్లుగప్పి వివిధ దేశాల మధ్య మోదీ రాకపోకలు సాగించడం ఇకపై కష్టం. అతని అరెస్టుకు మార్గం సుగమమవుతుంది. ఒకవేళ నీరవ్ కనిపిస్తే తక్షణ అరెస్టు చేయడం లేదా అదుపులోకి తీసుకోవాలని నోటీసుల్లో 192 సభ్య దేశాల్ని ఇంటర్‌పోల్ కోరింది.
ఒకసారి అరెస్టయితే అతన్ని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మే 2008– మే 2017 మధ్య కాలంలో నీరవ్ మోదీకి జారీ చేసిన ఐదు పాస్‌పోర్టుల వివరాల్ని ఆర్‌సీఎన్‌లో పేర్కొన్నారు. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీటుతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన అరెస్టు వారెంట్ ఆధారంగా రెడ్ కార్నర్ నోటీసు(ఆర్‌సీఎన్)ను ఇంటర్‌పోల్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూడక ముందే.. నీరవ్ మోదీ, అతని భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్, మామ చోక్సీ విదేశాలకు పరారయ్యారు. అవినీతి, మోసం ఆరోపణలపై మోదీ, చోక్సీలతో పాటు నిశాల్, పరబ్‌ల పేర్లను సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment