'ఆ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించాలి'
న్యూఢిల్లీ: అమరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు తమ బాధ్యతగా జరుపుకునేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ ఆదేశాలు పంపించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యా సంస్థలకు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి జనవరి 30న ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా అమరుల దినోత్సవాన్ని పాటించేలా, ఆరోజు అందరూ అందులో పాల్గొనేలా చేయాలని ఆదేశాల్లో సూచించింది. భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మగాంధీ 1948, జనవరి 30న హత్యకు గురైన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆ తేదిని అమరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. అయితే, దీనిని అందరూ సక్రమంగా అనుసరించడం లేదనే అపవాదు కొద్దికాలంగా ఎదురవుతుంది. దీంతో ఈసారి జనవరి 30న ఉదయం 11గంటల ప్రాంతంలో ఎవరు ఎలాంటి పనుల్లో ఉన్నా వాటన్నింటిని నిలిపేసి ఓ రెండు నిమిషాలపాటు మౌనంపాటించి గాంధీ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరులందరికీ మనసులో వందనం చేసుకునేలా చేయాలని, దేశ ఐక్యత స్ఫూర్తిని ప్రజ్వరిల్లేలా చేయాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన విశేషాలతో కూడిన చర్చలు, సమావేశాలు, సభలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది.