ములాయంతో పెట్టుకుంటే ఇంతేమరి!
లక్నో: ఉత్తరప్రదేశ్ పాలకపక్ష సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై కేసు పెట్టేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడ్డ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్‌కు మరిన్ని చిక్కులు ఎదురుచూస్తున్నాయి. ఠాకూర్‌కు ఏ జిల్లాలోనైతే పోస్టింగ్ ఇచ్చారో ఆ జిల్లాలో ఆయనకు, ఆయన బంధువులకున్న అన్ని స్థిర, చరాస్తుల వివరాలను వెలికితీయాల్సిందిగా యూపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం అడిషనల్ డెరైక్టర్ జనరల్ సంగీతా సింగ్ లక్నో, బారబంకి, బల్లియా, దేవరియా, గోండ, బస్తి స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాలకు లేఖలు రాసింది. ఈ విభాగాల పరధిలో ఠాకూర్ లేదా ఆయన బంధువుల పేరిట ప్లాట్లు, ఫ్లాట్స్, భూములు ఎక్కడెక్కడున్నాయో వివరాలు సేకరించి జూలై 20వ తేదీకల్లా పంపించాలని ఆ లేఖల్లో సంగీతా సింగ్ ఆదేశించారు.
స్టడీ లీవ్ తీసుకొని సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నావనే ఆరోపణలతో సోమవారం నాడే ఠాకూర్‌ను విధుల నుంచి పోలీసు డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. ఓ సామాజికాంశంలో ములాయం తనను బెదిరించారంటూ గత శుక్రవారం మీడియాకు ఓ ఆడియో టేపును విడుదల చేయడమే ఠాకూర్ చేసిన పాపం. అదే రోజు ములాయంపై కేసు నమోదు చేసేందుకు ఠాకూర్ విఫలయత్నం చేశారు. ఓ ఐపీఎస్ అఫీసరైనప్పటికీ ఆయన కేసును నమోదు చేసుకోవడానికి ఏ పోలీసు స్టేషన్ అధికారి అంగీకరించలేదు.
అంతేకాకుండా అదే రోజు ఆయనపై రేప్ ఆరోపణలతో ఓ కేసును పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత మూడు రోజులకే సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించావంటూ సస్పెన్షన్. ఇప్పుడు ఆయన, ఆయన బంధువుల ఆస్తుల వేట. తనపై వచ్చిన ఆరోపణలపై దయచేసి సీబీఐతో దర్యాప్తు చేయమని డిమాండ్ చేస్తున్న ఠాకూర్ తాజా పరిణామాలపై స్పందిస్తూ ‘మంచిదే. నన్ను ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఆస్తుల వేటను ప్రారంభించింది. కానీ చూద్దాం’ అని వ్యాఖ్యానించారు.