ఫుట్‌పాత్‌పై ధర్నా చేస్తున్న ఐపీఎస్ అరుణ్ రంగరాజన్ (ఇన్‌సెట్లో) ఐపీఎస్ (ఫైల్)
పిల్లలను చూడకుండా ఇక్కడ నుంచి కదలనని అతడు. ఇంటి ఛాయల్లోకిరానివ్వబోనని ఆమె. డిమాండ్ సాధనకు ఆమె ఇంటి ముందు నిరవధిక ధర్నాకు కూర్చున్నారు ఆయన. నాకేం సంబంధం అని మాజీ భార్య తలుపులు మూసేసింది. చలిలో వణుకుతూ ఫుట్‌పాత్ ముందు అనామకుడుగా ఆయన ధర్నా. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ ఉదంతంలో (మాజీ) భార్యభర్తలు ఇద్దరూ చట్టాన్ని కాపాడే ఐపీఎస్ అధికారులు కావడం గమనార్హం. ఒక ఐపీఎస్ అధికారి సగటు మనిషిలా రోడ్డుపై దీక్షకు కూర్చోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుటుంబ కలహాలకు ఎవరూ అతీతం కాదని చాటింది.
సాక్షి, బెంగళూరు: కొడుకును చూడనివ్వాలని ఐపీఎస్ అధికారి, కల్బుర్గి అంతర్గత భద్రతా విభాగపు ఎస్పీ అరుణ్ రంగరాజన్ బెంగళూరు వసంతనగరలో ఉన్న భార్య, వీఐపీ భద్రతా విభాగం డీసీపీ ఇలాకియా కరుణాకరన్ ఇంటి ముందు ఫుట్‌పాత్‌పై ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ధర్నా చేశారు.
అన్నం నీళ్లు ముట్టకుండా
ఒక సమావేశం కోసం కల్బుర్గి నుంచి బెంగళూరుకు వచ్చిన అరుణ్.. ఇలాకియా బంగ్లాకు వెళ్లాడు. కొడుకును చూడనివ్వాలని కోరగా, ఆమె తిరస్కరించారు. ఆవేదనకు గురైన ఆయన ఇంటి ముందే ధర్నా చేపట్టారు. చలిలో అన్నం, నీరు ముట్టకుండా దీక్ష కొనసాగించారు. ఈలోపల హైగ్రౌండ్స్ పోలీసులు వచ్చి నచ్చజెప్పినా ఆయన పట్టు వీడలేదు. విషయం తెలుసుకుని ఆయన మిత్రుడు, డీసీపీ భీమాశంకర్ గుళేద్ దంపతులు వచ్చి ధర్నాను విరమింపజేసి తమ ఇంటికి తీసుకొని వెళ్లారు.
గతంలో విడాకులు
ఇలాకియా, అరుణ్ ఇద్దరూ ఐపీఎస్‌లు అయ్యాక ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. వివిధ కారణాల వల్ల కలహాలు పెరగడంతో కొంతకాలం కిందట న్యాయస్థానం మెట్లు ఎక్కి విడాకులు పొందారు. అప్పటికే వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం బిడ్డను భార్య చూడటానికి అవకాశం కల్పించడం లేదని అరుణ్ రంగరాజన్ ఆరోపిస్తున్నారు.
ఆమె ఒత్తిడితోనే బదిలీ: అరుణ్
అరుణ్ రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం చత్తీస్‌గడ్‌లోలో పని చేసేవారం. ఆ ప్రాంతం మహిళలకు సురక్షితం కాదు, మనం కర్ణాటకకు బదిలీ చేసుకొని వెళదామని భార్య ఒత్తిడి చేసేవారు. అది నాకు ఇష్టం లేదు. చివరకు ఇలాకియా నా పేరుతో బదిలీ కోసం లేఖ రాసి చత్తీస్‌గడ్ ప్రభుత్వానికి పంపారు. అక్కడ నుంచి బదిలీ అయి ఇక్కడికి వచ్చాం. బదిలీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే భార్య బంధువులు నచ్చజెప్పారు. కర్ణాటకకు వచ్చిన తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నాం. కొడుకు ఆమె వద్దనే ఉన్నాడు. ఇప్పుడు కొడుకును చూడనివ్వడం లేదు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment