సీఎం కుమారస్వామిని కలిసిన అణ్ణామలై
ఐపీఎస్.. ఆ ఉద్యోగం కోసం ఏళ్లతరబడి శ్రమిస్తారు. ఉద్యోగం వచ్చిందా.. అధికారం, డబ్బు, దర్పం అన్నీ సొంతమనుకుంటారు. చక్రవర్తిలా బతికేయవచ్చని ఆశిస్తారు. కానీ ఆయన మాత్రం వీటి కోసం అర్రులు చాచలేదు. కుటుంబంతో గడపడానికి కూడా సమయం లేని ఈ కొలువు వృథా అనుకుని తృణప్రాయంగా వదులుకున్నారు.
సాక్షి, బెంగళూరు: సమర్థునిగా, ముక్కుసూటి అధికారిగా ప్రశంసలు అందుకున్న ఐపీఎస్ అధికారి అణ్ణామలై రాజీనామా చేశారు. అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నంగా మారిన బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ అయిన ఆయన రాజీనామా లేఖను మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. అనంతరం సీఎం కుమారస్వామిని కలిసి వీడ్కోలు తీసుకున్నారు. కర్ణాటక సింహంగా అభిమానుల చేత మన్ననలు పొందిన అణ్ణామలై తీరిక లేని ఉద్యోగం వల్ల వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖలో సాగించిన సేవలు ఇక చాలు అని నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఉద్యోగం వల్ల ఎంతో కోల్పోయాను
9 ఏళ్లుగా విధి నిర్వహనలో ఉండడం వల్ల కుటుంబ జీవితాన్ని చాలా కోల్పోయినట్లు, కుటుంబసభ్యులకు సమయం ఇవ్వలేకపోయినట్లు అణ్ణామలై చెప్పారు. ‘ఈ వృత్తిలో చేరినప్పటి నుంచి ఒక్క పెళ్లికి వెళ్లలే కపోయాను. కనీసం బంధువులు మరణించిన వారి అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయాను. తల్లీదండ్రులు, బంధువులు, స్నేహితులంతా ఊరిలో ఉన్నారు. నేను ఇక్కడ ఉండి ఏమీ చేయాలి. అందుకే రాజీనామా చేస్తున్నాను’ అని స్పష్టం చేశారు. గత ఆరు నెలల క్రితమే రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు, కానీ ఎన్నికల ముగిసే వరకు పని చేసి వెళ్లాలని ఇంతకాలం ఆగినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో కేవలం 21 రోజులు మాత్రమే సెలవులు తీసుకున్నట్లు, నిత్యం పని చేస్తూ అలసిపోయాయని, ఇప్పుడు తనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. పోలీసు శాఖలో ఎంతో మంది మంచి అధికారులు ఉన్నారని,ఒక్కొక్కరు 15 నుంచి 16 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. తన కుటుంబానికి సమయం కేటాయిస్తానన్నారు. తన కుమారుడి చదువులో సహాయపడుతానని చెప్పారు.
అభిమానుల ఆవేదన
అణ్ణామలై రాజీనామాతో ఆయన అభిమానులు ఆవేదనకు లోనయ్యారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. నిజాయితీ కలిగిన మీలాంటి పోలీసులు రాజీనామా చేస్తే ప్రజలను రక్షించే వారు కరువవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆయన ఎస్పీగా పనిచేసిన చిక్కమగళూరు నుంచి ఇలాంటి డిమాండ్లు అధికంగా వచ్చాయి. తమిళనాడుకు చెందిన అణ్ణామలై 2011 2011 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. 8 నెలల కిందట బెంగళూరుకు డీసీపీగా బదిలీ అయినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రాజీనామా అనంతరం ఆయన రాజకీయాల్లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. గత ఆరు నెలలుగా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలతో, ముఖ్యనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఏ రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని ఆయనీ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment