
కిరణ్ బేడీని తేవడం సరైనదేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలైన కొన్ని రోజుల తర్వాత.. ఆ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలపై.. ఆ పార్టీ సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పలు ప్రశ్నలు లేవనెత్తింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలైన కొన్ని రోజుల తర్వాత.. ఆ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలపై.. ఆ పార్టీ సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పలు ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌బేడీని తీసుకురావటాన్ని ప్రశ్నించింది. ‘‘పార్టీలో ఐక్యత లోపించటం, ప్రణాళికారచన లోపం.. మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవటంలో లోపం వల్ల బీజేపీ ఓడిపోయిందా?’’ అని ఆర్‌ఎస్‌ఎస్ తన అధికార వారపత్రిక ‘పాంచజన్య’లో వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఎన్నికల్లో ‘‘పార్టీ నేతలు కొందరు తమను ప్రజలు అత్యధికంగా ఆమోదిస్తారన్న భ్రమల్లో కూరుకుపోయారా? ‘మోదీ హవా’పైనే ఎక్కువగా ఆధారపడ్డారా?’’ అని నిర్మొహమాటంగా ప్రశ్నించింది. ‘‘బీజేపీ ఎందుకు ఓడిపోయింది? అనేది ప్రశ్న. కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిని చేయటం సరైన నిర్ణయమేనా? హర్షవర్థన్‌ను కానీ మరొక ఢిల్లీ నేతను గానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకుతెచ్చినా.. లేదా అసలు ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవా?’’ అని వ్యాఖ్యానించింది. ‘‘బీజేపీకి తన సిద్ధాంతం, అన్ని పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండే కార్యకర్తలు కాక.. ఇంకేం ఆస్తులు ఉన్నాయో పార్టీ నేతలు జవాబు చెప్పాలి’’ అని ప్రశ్నించింది. పార్టీ అనేది తమ ఇష్టానుసారం నడిచే ఒక యంత్రం అని ప్రభుత్వంలోని, పార్టీలోని కొందరు వ్యక్తులు భావించినట్లయితే.. ఢిల్లీ ఫలితాలు ఈ భ్రమను తొలగించాయి’’ అని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా కాపాడుకోగలగటానికి కారణం.. పార్టీ కార్యకర్తల్లోని జాతీయ సిద్ధాంతం.. పార్టీ పట్ల వారి అంకితభావం, నిబద్ధతలేనని పేర్కొంది. ఢిల్లీ ఓటమిపై బీజేపీ నైరాశ్యం వీడి ఆత్మావలోకనం చేసుకోవలసిందిగా ఆర్‌ఎస్‌ఎస్ తాజా ‘పాంచజన్యం’లోని ముఖచిత్ర వ్యాసంలో సూచించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపైనా.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నేరవేర్చాల్సిన అవసరం గురించీ ఆర్‌ఎస్‌ఎస్ కథనం ప్రస్తావించింది.