ఇది... ఉగ్రరక్కసి రాజ్యం | isil Terrorism Blood slide | Sakshi
Sakshi News home page

ఇది... ఉగ్రరక్కసి రాజ్యం

Published Sun, Apr 19 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

ఇది...  ఉగ్రరక్కసి  రాజ్యం

ఇది... ఉగ్రరక్కసి రాజ్యం

ఐఎస్‌ఐఎస్.. అబుబకర్ అల్-బగ్దాదీ!  
ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న పేర్లు ఇవి.


ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను అనూహ్యమైన బలప్రయోగంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్‌ఐఎస్.. తాను ‘ఖాలీఫా’ను స్థాపించానని.. తమ ఖాలీఫ్ అబుబకర్ అల్-బగ్దాదీ అని ప్రకటించింది. ఖాలీఫా అంటే ‘ఇస్లాం రాజ్యం’. ఖాలీఫ్ అంటే ఆ రాజ్యానికి అధినేత, మహమ్మద్ ప్రవక్త వారసుడు. అరేబియా ప్రాంతంతో పాటు.. మధ్యప్రాచ్యమంతా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వరకూ విస్తరిస్తామని.. అమెరికా ఖండంలోని అగ్రరాజ్యం శ్వేతసౌధం పైనా తమ జెండా ఎగురవేస్తామని ఐఎస్‌ఐఎస్ తన ‘ప్రణాళిక’ను వెల్లడించింది. ఇరాక్, సిరియాల్లో ఈ సంస్థ అధీనంలో ఉన్న ప్రాంతంలో జరుగుతున్న రక్తపాతం.. ఆ సంస్థ సాగిస్తున్న నరమేధం, ప్రయోగిస్తున్న భీకర హింసల గురించి వస్తున్న వార్తలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి. అసలు ఏమిటీ ఐఎస్‌ఐఎస్..? ఎవరీ అల్-బగ్దాదీ..? - ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం రాజ్యం విస్తరణ, ముస్లిం మతస్తుల్లో వచ్చిన చీలికల నుంచి.. మొదటి ప్రపంచయుద్ధంలో పశ్చిమ దేశాల ప్రణాళికలు.. అనంతర కాలంలో అరబ్ దేశాలపై ఆక్రమణలు.. అవి ముస్లిం ప్రపంచంపై చూపిన, చూపుతున్న ప్రభావం.. వీటన్నిటి గురించీ కొంత తెలుసుకోవాల్సిందే!
 
‘ఇస్లాం’లో చీలిక.. ‘రాజ్యం’ విస్తరణ...


అరబ్ ప్రాంతాన్ని ఇస్లాం మతం కింద ఒక రాజ్యంగా ఏకం చేసిన మహమ్మద్ ప్రవక్త 632 సంవత్సరంలో మరణించిన తర్వాత.. ఆయన వారసుడిగా ఇస్లాం రాజ్యపు అధినేత అయిన ‘ఖాలీఫ్’ను ఎంపిక చేసే విషయమై ముస్లిం ప్రజలు షియాలు - సున్నీలుగా చీలిపోయారు.  
 ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్యం చేతులు మారుతుండగా.. రాషిదున్, ఉమాయ్యద్, అబ్బాసిద్ తదితర ఖలీఫాల కాలంలో ఇస్లాం రాజ్యం మతపరంగా, రాజకీయంగా, భౌగోళికంగా విస్తరించింది. సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్‌లతో మొదలు పెట్టి.. ఉత్తర ఆఫ్రికా ప్రాంతం, ఐబీరియన్ ద్వీపకల్పం, సింధు నదీ లోయ, ఉత్తర భారతదేశం వరకూ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఆయా ప్రాంతాల్లో నివసించే స్థానికులు, గిరిజన తెగలు చాలా వరకూ ఇస్లాం మతస్థులయ్యారు. 1453 సంవత్సరానికి టర్కీ అటామన్ సుల్తానులు ఖాలీఫ్‌లు అయ్యారు. క్రమంగా వారిని ఖాలీఫా సంరక్షకులుగా ముస్లిం ప్రపంచం గుర్తించింది.  నాలుగైదు శతాబ్దాలు అటామన్ వంశం ఖాలీఫ్‌లుగా.. ‘ఖాలీఫా’ కొనసాగింది.
 
 ప్రపంచయుద్ధం.. అటామన్ల ఓటమి...


19వ శతాబ్దం వచ్చేసరికి అప్పటికే చాలా విస్తృతమైన భూభాగాన్ని పాలించడానికి స్థానికంగా ప్రతినిధులను నియమించినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో తిరుగుబాట్లు, అంతఃసంఘర్షణలతో అటామన్ ఖాలీఫా సతమతమవుతోంది. అప్పటికే యూరప్ సామ్రాజ్యవాద దేశాలైన.. జారిస్టు రష్యా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో పాటు.. ఇటలీ, ఆస్ట్రియా హంగరీ తదితర దేశాలు.. తమ సామ్రాజ్య, ఆర్థిక అవసరాల నిమిత్తం.. అటామన్ రాజ్యంలో భాగంగా ఉన్న బాల్కన్ ద్వీపకల్పంలోని ప్రాంతాలపై కన్నేశాయి. అక్కడ స్థానికంగా నివసిస్తున్న అనేక జాతుల్లో జాతీయతావాదాన్ని ప్రేరేపించి అలజడి లేవనెత్తాయి. మరొకవైపు నుంచి ఆక్రమణలూ ప్రారంభించాయి. ఆ క్రమంలో 1913లో జరిగిన బాల్కన్ యుద్ధంలో అటామన్ సుల్తానులు గట్టి ఎదురుదెబ్బ తిన్నారు. సైనికపరంగా, ఆర్థిక పరంగా తీవ్రంగా బలహీనపడ్డారు. ఇక బాల్కన్ ద్వీపకల్పంలో భూభాగాలు, అక్కడి సముద్ర జలాల మీద పట్టు కోసం యూరప్ రాజ్యాల మధ్య ఘర్షణ చెలరేగింది. అది చినికిచినికి 1914లో మొదటి ప్రపంచ యుద్ధంగా రూపుతీసుకుంది.

ఇందులో రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఒకవైపు ఉంటే.. ఆస్ట్రియా, జర్మనీలు మరొక వైపు ఉన్నాయి. ఈ మహా యుద్ధం ఆరంభంలో జర్మనీ, ఆస్ట్రియాలు కొంత ఆధిపత్యం చూపటంతో.. వాటితో కలసి యుద్ధం చేస్తే కోల్పోయిన బాల్కన్ ప్రాంతాల్లో కొన్నిటిని మళ్లీ పొందవచ్చని, రష్యా తదితర దేశాల ఆక్రమణను నిలువరించవచ్చని అటామన్ సుల్తానులు తలచి.. యుద్ధంలోకి దిగారు. 1917 ఏప్రిల్‌లో అమెరికా కూడా యుద్ధ రంగంలోకి దిగితే.. అక్టోబర్‌లో రష్యాలో బోల్ష్‌విక్ విప్లవం కారణంగా ఆ దేశం వైదొలగింది. అప్పటికే ఆర్థికంగా, సైనికంగా తీవ్రంగా దెబ్బతిని ఉన్న అటామన్ సుల్తానులు ఈ యుద్ధంలో ఓడిపోయారు. వారి భూభాగమంతా బ్రిటన్, ఫ్రాన్స్‌ల అధీనంలోకి వెళ్లింది.
 
ముక్కలు చెక్కలుగా ఇస్లాం రాజ్యం..

ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే.. అటామన్ రాజ్యంలోని అరబ్బులు తమ స్వీయ పాలన డిమాండ్‌తో బ్రిటన్ సహకారంతో తిరుగుబాటు మొదలుపెట్టారు. స్వతంత్ర అరబ్ దేశం ఏర్పాటుకు సహకరిస్తామని వారితో బ్రిటన్ ఒప్పందం కూడా చేసుకుంది. అలాగే.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు పాలస్తీనాకు వచ్చి నివసించడానికి అనుమతిస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. మరోవైపు.. ఇస్లాం రాజ్యంలోని ప్రాంతాలను తమ మధ్య ఎలా పంచుకోవాలనే దానిపై బ్రిటన్ - ఫ్రాన్స్‌లు రెండూ అవగాహనకు వచ్చాయి. ‘సైక్స్ - పైకాట్ ఒప్పందం’గా చెప్పే ఈ అవగాహన కింద.. ఈజిప్టు, ఇరాన్, పాలస్తీనాలు బ్రిటన్‌కు.. సిరియా, లెబనాన్‌లు ఫ్రాన్స్‌కు.. ఇస్తాంపుల్, జలసంధులు రష్యా పంచుకునేలా అంగీకారానికి వచ్చాయి. అలాగే.. అనటోలియాను రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆర్మీనియాలు పంచుకోవాలని, ప్రష్యాను రష్యా, బ్రిటన్‌లు పంచుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.  అయితే రష్యా యుద్ధం నుంచి వైదొలగిన తర్వాత ఈ రహస్య ఒప్పందాలను బయటపెట్టింది.

అటామన్ రాజ్యంపై తమ హక్కును వదులుకుంది. 1918లో మొదటి ప్రపంచం యుద్ధం ముగిసింది. అటామన్ రాజ్యం, అరబ్ చమురు వనరులు ముక్కలుగా యూరప్ దేశాల అధీనంలోకి వెళ్లాయి. అమెరికా కూడా కొంత భాగం పంచుకుంది. ఈ క్రమంలో అరబ్బులు - తురుష్కులకు మధ్య, ముస్లింలు - యూదులకు మధ్య చారిత్రక వైరానికి బీజాలు పడ్డాయి. నామమాత్రంగా మిగిలిన ‘ఖలీఫా’ను కొనసాగించాలని, అటామన్ సుల్తానును ఖాలీఫ్‌గానే ఉంచాలన్న డిమాండ్‌తో కిలాఫత్ ఉద్యమం మొదలైంది. (బ్రిటిష్ ఇండియాలో మొదలైన ‘కిలాఫత్ ఉద్యమం’ భారత ఉపఖండ విభజనకు పునాది వేసింది.) యూరప్ దేశాల పట్టుదల కారణంగా.. 1924 మార్చి 3వ తేదీన టర్కీ రిపబ్లిక్ దేశంగా మారుతూ ‘ఖాలీఫా’ను, ‘ఖాలీఫ్’ను శాశ్వతంగా రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. 1,300 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకుల మధ్య కొనసాగిన ‘ఇస్లాం రాజ్యం’ వందేళ్ల కిందట అలా అంతమైంది.
 
ఐఎస్‌ఐఎస్ ‘ఖలీఫా’...

మరో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత.. అరబ్ దేశాలు ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. అయితే.. ఇస్లాం రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఖలీఫాను రాజకీయ చర్యల ద్వారా పునరుద్ధరించాలని ముస్లిం బ్రదర్‌హుడ్, హిజ్బ్ ఉట్-తాహ్రిర్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ‘ఖాలీఫా’ విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత కూడా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పాటు, అఫ్గానిస్థాన్ ఆక్రమణ, ఇరాక్ ఆక్రమణ వంటి అనేక పరిణామాలు.. ముస్లిం ప్రపంచంలో పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతను పెంచుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో బలప్రయోగం ద్వారా ఖాలీఫాను పునరుద్ధరించాలని, పశ్చిమ దేశాలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో అల్‌కాయిదా వంటివి పుట్టుకొచ్చాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ‘ఐఎస్‌ఐఎస్’ మా త్రం.. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ‘ఖాలీఫా’ను స్థాపించినట్లు ప్రకటించుకుంది. 2014 జూన్ 29న తాను ప్రపంచ వ్యాప్త ఖలీఫా గా ఐఎస్‌ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తన పేరు ను ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చుకుంది. అయితే.. ఏ దేశం కానీ, ప్రధాన స్రవంతి ముస్లిం సంస్థలు కానీ దీనిని ఖాలీఫాగా గుర్తించటానికి నిరాకరించాయి.
 
ఐఎస్‌ఐఎస్ నేత ఎవరు?

ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌గా ఉన్న అబుబకర్ అల్-బాగ్దాదీ  (43) అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. స్వతహాగా బిడియస్తుడని పేర్కొంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. ఇతడు నేరుగా మహమ్మద్ ప్రవక్త వారసుడని ప్రచారం. ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో తన నగరంలో ‘జైష్‌హల్ అల్ సున్నా అల్-జమా’ అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను నెలకొల్పాడు. కొన్ని నెలలకే 2004 ఫిబ్రవరిలో ఫలుజాలో ఇతడిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకుని.. బాగ్దాద్ శివార్లలో ‘క్యాంప్ బుక్కా’ జైలుకు తరలించాయి. అదే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేశాయి. అనంతరం.. 2006లో బాగ్దాదీ సంస్థ, మరికొన్ని సున్నీ తిరుగుబాటు సంస్థలు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. అది ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’గా పేరు మార్చుకున్నపుడు అందులో బాగ్దాదీ హోదా పెరిగింది. 2010 మే నాటికి సంస్థ అధినేత అయ్యాడు.
 
యువత ఎలా ఆకర్షితమవుతోంది..?

ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు.. అరబ్ దేశాల నుంచే కాదు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ.. భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్‌ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ ‘సాధించిన విజయం’పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి. యుక్తవయసులో ఉండే ఉడుకురక్తంతో పాటు.. పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతతో రగులుతున్న ముస్లిం యువతకు ఇది తమకు అందివచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఒకసారి అందులోకి వెళ్లాక.. అక్కడి అంతులేని హింస, అరాచకత్వాలను సహించలేక.. అందులో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతున్న యువకుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవలే ముంబై నుంచి సిరియా వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరిన నలుగురు యువకులు తాము ఐఎస్‌ఐఎస్ నుంచి బయటపడాలనుకుంటున్నామని.. తమను రక్షించాలని ముంబైలోని తమ కుటుంబాలను సంప్రదించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
 
జాతుల హత్యాకాండ...  

ఐఎస్‌ఐఎల్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ‘జాతి, మత పరమైన’ హత్యాకాండలకు, హింసకు పాల్పడుతోందని.. ఇతర జాతుల వారిని తుడిచిపెట్టే కార్యక్రమం కొనసాగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. సున్నీ ఇస్లాం, షరియా చట్టాలకు తాను ఇచ్చే భాష్యం ప్రకారం జీవించాలని ఈ సంస్థ స్పష్టం చేస్తోందని.. వినని వారిపై హింసకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా షియా ముస్లింలు, స్థానికులైన అస్సీరియన్, చాల్దియన్, సిరియాక్, ఆర్మీనియన్ క్రిస్టియన్లు, యాజిదీలు, డ్రూజ్, షబాక్‌లు, మాందియాన్లను లక్ష్యంగా చేసుకుని హింసిస్తోంది. ఖ్వినియేలో 90 మంది వరకూ, హర్దాన్‌లో 60 మంది, సింజార్‌లో 500 మంది వరకూ, రమాదీ జబాల్‌లో 70 మంది, ధోలాలో 50 మంది, ఖానాసోర్‌లో 100 మంది, హర్దాన్‌లో 300 మంది వరకూ, అల్-షిమాల్‌లో డజన్ల సంఖ్యలో, జదాలాలో 14 మంది, టాల్ అఫర్ జైలులో 200 మంది యాజిదీలను ఐఎస్‌ఐఎస్ హత్యచేసింది.

ఖోచోలో 400 మంది యాజిదీలను చంపేసి వేయి మందిని అపహరించింది. బేషిర్‌లో 700 మంది షియా తుర్కుమెన్లను చంపింది. మోసుల్‌లోని బాదుష్ జైలులో 670 మంది ఖైదీలను చంపింది. ఈ హత్యలన్నీ ఇరాక్‌లోని ఆయా ప్రాంతాలను ఐఎస్‌ఐల్ ఆక్రమించుకుంటున్న క్రమంలో 2014 ఆగస్టులో జరిగినవే. ఇక సిరియాలోనూ ఘ్రానీజ్, అబు హమాన్, కాష్కియే పట్టణాల్లో సున్నీ అల్‌షియాటట్ తెగకు చెందిన 700 మందిని హతమార్చారు.
 
ఐఎస్‌ఐఎస్ ఎలా పుట్టింది?

 
ఇరాక్‌లో జమాత్ అల్-తాహిద్ వల్-జిహాద్ అనే పేరుతో 1999లో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అల్‌ఖైదాతో చేతులు కలిపి.. ‘అల్-ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) అని పేరు మార్చుకుంది. 2003లో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏక్యూఐ పాలుపంచుకుంది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటును ప్రకటించింది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’ (ఐఎస్‌ఐ)గా మార్చుకుంది. అబుబకర్ అల్-బాగ్ధాదీ నాయకత్వంలో ఈ సంస్థ గణనీయంగా పెరిగింది. సిరియా అంతర్యుద్ధంలో ప్రవేశించి.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించింది. 2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జభాట్ అల్-నుస్రా ఫ్రంట్‌ను విలీనం చేసుకుని.. పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ - ఐఎస్‌ఐఎస్‌గా (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరా అండ్ ద లెవాంట్ - ఐఎస్‌ఐఎల్ అనీ అంటారు) మార్చుకుంది. ఇది 2014 ఫిబ్రవరి వరకూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సన్నిహత సంబంధాలు కలిగివుంది. కొంత కాలం ఆధిపత్య పోరు తర్వాత ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అల్‌ఖైదా అధినేత అల్-జవహరి ప్రకటించారు.
 
చాటింగ్‌తో వలవేస్తున్న ఉగ్రవాదులు...

 
హైదరాబాద్: ‘‘నేను జిహాద్ (పవిత్ర యుద్దం) కోసం ఇరాక్‌లోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు, అదృష్టం ఉంటే స్వర్గంలో కలుసుకుంటా’’ అని హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌కు చెందిన ఇంజనీరింగ్  విద్యార్థి అబ్దుల్లా (25) గత ఏడాది తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పశ్చిమబెంగాల్ సరిహద్దులో బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న అబ్దుల్లాను పట్టుకున్నారు. అతడితో పాటు కరీంనగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నోమాన్, చాంద్రాయణగుట్టకు చెందిన ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు అద్నాన్ అహ్నాన్, సనాత్ తహసిన్‌లు కూడా ఉన్నారు. ఈ ఉదంతం హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది. వీరిని నగర పోలీసులు విచారించగా వీరి మాదిరిగానే ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు  మరో 42 మంది యువకులు మానసికంగా సిద్ధమయ్యారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యువకులను పోలీసులు పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పించి పంపించి వేశారు. వీరిలో కొందరిని ముందు జాగ్రత్త చర్యగా మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. వీరందరిపై ప్రస్తుతం పోలీసుల నిఘా కొనసాగుతుంది.

అయితే.. ఈ ఆరు నెలల కాలంలోనే ఐఎస్‌ఐఎస్‌లో చేరదలచుకున్న వారి సంఖ్య 84కి పెరిగింది. ఇలాంటి ఉదంతాలు తరచుగా కనిపిస్తుండటంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఐఎస్‌ఐఎస్ వైపు మొగ్గుచూపుతున్న వారిలో ఇంజనీరింగ్, మెడికల్ విద్యను అభ్యసిస్తున్న వారితోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం ఉన్నారు. వీరిని సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులు ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా ముందు చాటింగ్‌లోకి దింపుతున్నారు. యువకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, వారికి నచ్చిన వారికి బాబ్రీ మసీదు విధ్వంసకాండ, ఇరాక్‌లో అమెరికా సైన్యాల అరాచకాల  లాంటి క్లిప్పింగులను పంపిస్తూ రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎనిమిది నెలల్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇరాక్, దుబాయ్, సిరాయాకు వెళ్లిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ మీదుగా ఎవరైనా వెళ్లారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement