
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ38
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్ నింగిలోని దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.29 గంటలకు నిప్పులు చిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్ అంతరిక్షంలోకి పయనమైంది. మొత్తం 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2ఈ ఉపగ్రహంతోపాటు దేశీయ యూనివర్సిటీకి చెందిన ఒక చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు ఉన్నాయి.
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావడం విశేషం. దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు.
కార్టోశాట్–2 ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియో గంపై మ్యాప్‌ల తయారు, విపత్తులను విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. రాకెట్ ప్రయోగం విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ఇస్రో అభినందనలు తెలిపింది.