Cartosat-2 series satellite
-
ISRO: సముద్రంలోకి కార్టోశాట్–2
బెంగళూరు: పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు. -
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్
-
నేడు నింగిలోకి వందో శాటిలైట్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన వందో ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించి 28 గంటల కౌంట్‌డౌన్ గురువారం ప్రారంభమైంది. కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ–40 ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరుతుంది. కౌంట్‌డౌన్ సందర్భంగా గురువారం రాకెట్‌కు నాల్గో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం నింపారు. -
ఒకేసారి 31 ఉపగ్రహాలు
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. జనవరి 10న ఒకేసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వీటిలో మన దేశానికి చెందిన కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహం కూడా ఉంది. తనకు అచ్చొచ్చిన ఉపగ్రహ వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేర్చనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31న పీఎస్ఎల్వీ–సీ39 ద్వారా నావిగేషన్ శాటిలైట్ ‘ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్’ని పరీక్షించగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం తర్వాత పీఎస్ఎల్వీని వినియోగిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి పీఎస్ఎల్వీ–సీ40 వాహన నౌకను ఉపయోగిస్తామని ఇస్రో పేర్కొంది. ఇందులో పంపనున్న 31 ఉపగ్రహాల్లో 28 విదేశీ నానో ఉపగ్రహాలు, మన దేశానికి చెందిన ఒక మైక్రో, ఒక నానో శాటిలైట్‌తోపాటు కార్టోశాట్ ఉపగ్రహం ఉన్నట్లు వివరించింది. విదేశీ ఉపగ్రహాలు ఫిన్లాండ్, అమెరికాలకు చెందినవని స్పష్టం చేసింది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ38
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ నింగిలోని దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.29 గంటలకు నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ అంతరిక్షంలోకి పయనమైంది. మొత్తం 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2ఈ ఉపగ్రహంతోపాటు దేశీయ యూనివర్సిటీకి చెందిన ఒక చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావడం విశేషం. దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. కార్టోశాట్–2 ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియో గంపై మ్యాప్‌ల తయారు, విపత్తులను విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. రాకెట్ ప్రయోగం విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ఇస్రో అభినందనలు తెలిపింది.