
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. జనవరి 10న ఒకేసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వీటిలో మన దేశానికి చెందిన కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహం కూడా ఉంది. తనకు అచ్చొచ్చిన ఉపగ్రహ వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేర్చనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ–సీ39 ద్వారా నావిగేషన్ శాటిలైట్ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్’ని పరీక్షించగా విఫలమైన విషయం తెలిసిందే.
ఈ ప్రయోగం తర్వాత పీఎస్‌ఎల్‌వీని వినియోగిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి పీఎస్‌ఎల్‌వీ–సీ40 వాహన నౌకను ఉపయోగిస్తామని ఇస్రో పేర్కొంది. ఇందులో పంపనున్న 31 ఉపగ్రహాల్లో 28 విదేశీ నానో ఉపగ్రహాలు, మన దేశానికి చెందిన ఒక మైక్రో, ఒక నానో శాటిలైట్‌తోపాటు కార్టోశాట్ ఉపగ్రహం ఉన్నట్లు వివరించింది. విదేశీ ఉపగ్రహాలు ఫిన్‌లాండ్, అమెరికాలకు చెందినవని స్పష్టం చేసింది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment