
చంద్రయాన్.. మంగళ్‌యాన్‌ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్! కనీసం ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే కాకుండా వారు అక్కడే వారం రోజులపాటు గడపాలన్నది ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన గగన్‌యాన్‌కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నా.. ఇస్రో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు కదులుతోంది. వ్యోమగాములను మోసుకెళ్లే రాకెట్.. క్యాప్సూల్‌ల రూపకల్పనతో పాటు అనేక ఇతర టెక్నాలజీలు, పరికరాల అభివృద్ధి దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో పరిశోధనశాలల్లో కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూస్థిర కక్ష్యలో ఉండగా.. వ్యోమగాములు ఏమేం ప్రయోగాలు చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
పది ప్రయోగాలకు ఏర్పాట్లు: గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వైద్య పరికరాలను పరీక్షించడం, బయోసెన్సర్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సూక్ష్మజీవులను ఉపయోగించుకోవడం వంటి 10 రంగాల్లో ఈ ప్రయోగాలు ఉంటాయి. అయితే ఇది పరిమితమైన జాబితా కానే కాదని, దేశంలోని విద్యాసంస్థలు తమ ఆలోచనలను పంచుకోవచ్చని ఇస్రో అధికారులు చెబుతున్నారు. భూమికి కనీసం 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగాలు జరుగుతాయి.
వ్యోమగాములు ఉన్న ప్రాంతం లోపలి ఉష్ణోగ్రత భూమ్మీద గది ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుందని, వాతావరణ పీడనం సముద్రమట్టం వద్ద ఉండాల్సినంత ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. కొన్ని ప్రయోగాలు వ్యోమగాములు ఉండే క్యాప్సూల్ లోపల జరిగితే.. కొన్ని బయట కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో ఉండే పరిస్థితులతో పాటు రాకెట్‌లో భూస్థిర కక్ష్యలోకి చేరే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా తట్టుకునేలా రెండు రకాలుగా పరికరాలను తయారు చేస్తోంది ఇస్రో. క్యాప్సూల్ లోపల వాడే పరికరాలు ఒకలా.. రాకెట్ ప్రకంపనలు, ధ్వనులను కూడా తట్టుకునేలా మిగిలినవి ఉంటాయన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment