లాలూ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
ఢిల్లీ సహా 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు
- రూ.వెయ్యి కోట్ల బినామీ భూ ఒప్పందాల కేసులో దాడులు
- బీజేపీ చర్యలకు భయపడను: లాలూ
న్యూఢిల్లీ: రూ.వెయ్యి కోట్ల బినామీ భూ ఒప్పందాల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ మంగళవారం దాడులు చేసింది. ఢిల్లీతోపాటు దాని సమీపం లోని మొత్తం 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. ఐటీ శాఖకు చెందిన సుమారు వంద మంది అధికారులు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఉదయమే ఢిల్లీ, గురుగ్రామ్, రేవరీ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతాలైన న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సైనిక్ ఫామ్స్, బిజ్వాసన్, దక్షిణ ఢిల్లీలోని పలు ఫామ్ హౌస్‌ల్లో తనిఖీలు జరిగాయి.
బినామీ లావాదేవీల చట్టం కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఐటీ అధికారులు వెల్లడించారు. తనిఖీల సందర్భంగా పలు కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను సీజ్ చేశామన్నారు. లాలూ, ఆయన కుటుంబానికి సంబంధం ఉన్న భూ ఒప్పందంలో భాగస్వామ్యం ఉందని భావించిన వ్యక్తులు, వ్యాపారస్తుల ఆస్తులపై తనిఖీలు చేశామని, ఈ బినామీ ఒప్పందాల్లో సుమారు రూ. వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయని, ఆ మేరకు పన్ను ఎగవేత జరిగిందని వివరించారు.
ఇందులోని కొన్ని ఆస్తులు లాలూ కుటుంబానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలతో సంబంధం ఉన్న ఆర్‌జేడీ ఎంపీ పీసీ గుప్తా కుమారుడు, పలువురు వ్యాపారు ల ఆస్తులపైనా దాడులు చేసి నిర్వహించినట్టు తెలిపారు. ఢిల్లీలో భూ ఒప్పందాలకు సంబంధించి లాలూ, ఆయన కుమార్తె, ఎంపీ మిసా భారతి, కుమారులు, బిహార్ మంత్రులు తేజస్వీ, తేజ్ ప్రతాప్‌లకు సంబంధం ఉందని, ఈ కుంభకోణం విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే అని ఆరోపణలు వచ్చాయి. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రొ కో పద్ధతిలో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. లాలూ కుటుంబ సభ్యులు స్థాపించిన సంస్థలకు చిరునామాగా లాలూ అధికారిక నివాసం చిరునామా ఉండటం.. ఈ కంపెనీల్లో ఉద్యోగులు కానీ, వ్యాపార కార్యకలాపాలు కానీ, టర్నోవర్ కానీ లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
నన్నెవరూ భయపెట్టలేరు: లాలూ
ఐటీ దాడులపై లాలూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘నా గొంతు నొక్కే ధైర్యం బీజేపీకి లేదు. ఒక్క లాలూను మాట్లాడకుండా చేయాలని అనుకుంటే.. కోట్లాది మంది లాలూ లు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు. ఉత్తుత్తి బెదిరింపులకు నేను భయ పడను’’ అని ట్విట్టర్‌లో లాలూ వరుస ట్వీట్లు చేశారు. మహా కూటమిని నిర్వీర్వం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు.
లెక్క చెప్పాల్సిన రోజు వచ్చింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఇళ్లపై ఐటీ, సీబీఐ దాడులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. ప్రతి దానికీ లెక్క చెప్పాల్సిన రోజు వచ్చిందని, అవినీతికి పాల్పడినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాలపై అధికార పార్టీ ప్రతీకారం కోసమే సీబీఐ, ఐటీ దాడులకు దిగుతోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పన్ను ఎగవేతలు లేదా నేరం జరిగినట్టు కచ్చితమైన సమాచారం, ఆధారాలు ఉంటే తప్ప ఆదాయపు పన్ను శాఖ గానీ, సీబీఐ గానీ చర్యలకు దిగవని స్పష్టం చేశారు. ‘ఉన్నత హోదాల్లో ఉన్నవారు డొల్ల కంపెనీల ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవడం చిన్న విషయం కాదు’అని జైట్లీ వ్యాఖ్యానించారు.