ఉపదేశాలతో అంటరానితనం పోదు
- ఆచరణలో చేసి చూపించాలి
- ఆర్‌ఎస్‌ఎస్ సహ కార్యవాహక్ కృష్ణగోపాల్ ఉద్ఘాటన
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సమాజంలో అంటరానితనం నివారణ గురించి ఉపదేశాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆచరణలో చేసి చూపించాలి. దళితులు, బలహీనవర్గాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారానే అంటరానితనం నివారణ సాధ్యమవుతుంది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సహకార్యవాహక్ కృష్ణ గోపాల్ ఉద్ఘాటించారు. స్వామి శ్రద్ధానంద జీవిత విశేషాలతో ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్ శాస్త్రి రచించిన ‘అసలు మహాత్మా’ హిందీ అనువాదం ‘అసలీ మహాత్మా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో జరిగింది. పుస్తకాన్ని ప్రముఖ రచరుుత ప్రొఫెసర్ రాజేంద్ర జిగ్న్యాసు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితోపాటు పలువురు మాజీ ఎంపీలు, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణగోపాల్ ప్రసంగిస్తూ.. వేదాల్లో, పురాణాల్లో అంటరానితనం లేనేలేదని గుర్తు చేశారు.
హిందూమతంలోని అంటరానితనాన్ని తొలగించేందుకు, వేదాలను ప్రజల వద్దకు చేర్చేందుకు స్వామిశ్రద్ధానంద విశేష కృషి చేశారని చెప్పారు. ‘‘అంటరానితనం మంచిది కాదని అందరం చెబుతుంటాం. కానీ మన రోడ్లను శుభ్రపర్చే పారిశుధ్య కార్మికులను ఎప్పుడైనా మన ఇంటికి భోజనానికి పిలుస్తామా?’’ అని ప్రశ్నించారు. మార్పు మననుంచే మొదలవాలని.. అప్పుడే సమాజం మారుతుందని, స్వామి శ్రద్ధానంద చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని చెప్పారు. స్వామి శ్రద్ధానంద జీవితంపై శాస్త్రి రాసిన పుస్తకం బాగుందని రాజేంద్ర జిగ్న్యాసు ప్రశంసించారు. హిందూమత పరిరక్షణ, వేద విద్యావ్యాప్తికోసం స్వామి శ్రద్దానంద ఎంతో కృషి చేశారన్నారు. సూఫిజం మూలంగా హిందూమతానికి ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు తరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాల్లో ఈ పుస్తకం ఉండాల్సిన అవసరమెంతరుునా ఉందన్నారు. వివిధ కారణాలవల్ల ఇతర మతాల్లో చేరినవారిని తిరిగి హిందూమతంలోకి ఆహ్వానించేందుకు శుద్ధి ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మా అనే పదానికి నిజమైన అర్హుడు స్వామి శ్రద్ధానంద అని ఎం.వి.ఆర్ శాస్త్రి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ స్వయంగా స్వామి శ్రద్ధానందను మహాత్మా అని సంబోధించారని గుర్తు చేశారు. స్వామి శ్రద్ధానంద దళితుల అభివృద్ధికి చేసిన సేవల గురించి ఎవరికీ తెలియదని, నిజమైన మహాత్ములను వెలుగులోకి తెచ్చేందుకే తాను ఈ పుస్తకం రాశానని చెప్పారు.