సీబీఐ దాడులపై స్పందించిన లాలూ
సీబీఐ దాడులపై స్పందించిన లాలూ
Published Fri, Jul 7 2017 1:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
బిహార్ : తన నివాసాల్లో సీబీఐ నిర్వహించిన దాడులపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదంతా బీజేపీ చేపడుతున్న రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు. అసలు సీబీఐ తన నివాసాల్లో ఎందుకు దాడులు నిర్వహించిందో కూడా తెలియలేదన్నారు. తానైతే ఏ తప్పుచేయలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ చేపడుతున్న ఈ రాజకీయ కుట్రలకు తాను కానీ, తన పార్టీ కానీ భయపడేది లేదని స్పష్టంచేశారు. సీబీఐ దాడులకు తన భార్య, పిల్లలు సహకరించాల్సిందిగా చెప్పానని, ఇది వారి తప్పుకాదని వెనకుండి మోడీ నిర్వహిస్తున్న తతంగమని చెప్పినట్టు తెలిపారు.
లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఉదయ ఉదయాన్నే లాలూ ప్రసాద్ ఇంటిపై సీబీఐ కొరడా ఝళిపించింది.. ఆయన నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కూడా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. మరోవైపు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ కూడా వెల్లడించింది. ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, హోటళ్ల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని సీబీఐ ధృవీకరించింది. ఈ అక్రమాలకు పాల్పడినందుకు అప్పటి రైల్వే మంత్రి లాలూ, ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వి యాదవ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌పై కేసు కూడా నమోదుచేసినట్టు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా మీడియా సమావేశంలో తెలిపారు.
మరోవైపు సీబీఐ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత పార్టీ జేడీయూ నేతలతో కూడా మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. లాలూ కుటుంబ సభ్యులపై సీబీఐ కేసులు, తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీబీఐ తనిఖీలు, తేజస్వీ యాదవ్‌పై చర్యల విషయాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. నితీష్ కేబినెట్‌లో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మంత్రిగా ఉన్నారు.
Advertisement