న్యూఢిల్లీ: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్ దాదారావ్ దాన్వే తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదించారు. ప్రధాని మోదీ సూచనపై ప్రణబ్ మంత్రి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. దాన్వే గురువారం తన రాజీనామాను ప్రధానికి సమర్పించగా ఆయన ఆమోదం తెలిపారు. జనవరిలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నియమితులైన దాన్వే ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న పార్టీ నియమం ప్రకారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావడంతో దాన్వే పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అందుకున్నారు.