నా పాలన తెరిచిన పుస్తకం
జాతినుద్దేశించి చివరి ప్రసంగంలో మన్మోహన్ ప్రధాని పదవికి రాజీనామా
పదేళ్ల భారాన్ని దించుకుంటూ నిష్ర్కమణ
ప్రజా తీర్పును మేమంతా గౌరవించాల్సిందే
అంతిమ తీర్పు కన్నా ముందు దానికే తలొంచాలి
ఇంత గొప్ప దేశానికి సేవ చేయడంనా అదృష్టం
నా వంటి సామాన్యుడిని ప్రధానిని చేసింది
ప్రజా సేవకు శాయశక్తులా ప్రయత్నించా
నా పదేళ్ల పాలనలో దేశం బలోపేతమైంది
మీ ప్రేమ, సానుభూతులను మోసుకెళ్తున్నా
ఉద్వేగభరితంగా మాట్లాడిన మన్మోహన్
కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: లాంఛనం ముగిసింది. పదేళ్లుగా పంటి బిగువున మోస్తూ వస్తున్న భారాన్ని మన్మోహన్‌సింగ్ (81) ఎట్టకేలకు దించుకున్నారు. ప్రధాని పదవికి శనివారం రాజీనామా చేశారు. తొలి సిక్కు ప్రధాని అన్న రికార్డుతో పాటు స్వతంత్ర భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత అసమర్థ, నిస్సహాయ ప్రధాని అన్న దుష్కీర్తిని కూడా మూటగట్టుకుని భారంగా నిష్ర్కమించారు. వరుసగా రెండుసార్లు ప్రధానిగా పూర్తి పదవీకాలాన్ని ముగించుకున్న ఆయన శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి సంక్షిప్తంగా వీడ్కోలు ప్రసంగం చేశారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నెహ్రూ తర్వాత వరుసగా అత్యధిక కాలం పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత సాధించిన మన్మోహన్, ‘ప్రధానిగా చివరిసారిగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే...
పునాదులు పటిష్టమయ్యాయి
‘‘పదేళ్ల క్రితం నాకు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధే తన పనిముట్టుగా, సత్యమే దారిచూపే దీపంగా భావిస్తూ స్వీకరించాను. నేను నిత్యం సరైన పనులే చేయాలని ఆ సందర్భంగా ప్రార్థించాను. పదవీ బాధ్యతలను పరిత్యజిస్తున్న ఈ వేళ, మనందరికీ దైవమిచ్చే అంతిమ తీర్పు కంటే ముందు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ప్రజాభిప్రాయమనే కోర్టు ముందు తలొంచాల్సి ఉంటుంది. నా తోటి పౌరులారా! మీరిచ్చిన తీర్పును అందరమూ గౌరవించాలి. తాజాగా ముగిసిన ఎన్నికలు మన ప్రజాస్వామ్య తంత్రపు పునాదులను మరింతగా పటిష్టపరిచాయి.
నావి సాదాసీదా మూలాలు
నావి అత్యంత సాదాసీదా మూలాలు. దేశ విభజన తాలూకు భారాన్ని మోసిన దురదృష్టవంతుడైన పిల్లాడిని. అలాంటి వ్యక్తిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన గొప్పదనం మన దేశానిది. ఇంత గొప్ప దేశానికి సేవ చేయగలగడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. ఇంతకంటే నేను కోరదగింది మరొకటేమీ లేదు, ఉండబోదు. దీన్ని నేనెప్పటికీ తీర్చుకోలేని రుణంగా, నాకు దక్కిన అపురూప గౌరవంగా నిత్యం సగర్వంగా గుర్తుంచుకుంటా.
నా పనితీరుతో గర్విస్తున్నా
మీనుంచి నిరంతరం అందుకున్న ప్రేమ, సానుభూతి ఈ వీడ్కోలు వేళ నా జ్ఞాపకాల్లో మెదులుతున్నాయి. నా జీవితమే కాదు, ప్రధానిగా నా పదవీకాలం కూడా ఓ తెరిచిన పుస్తకమని చాలాసార్లు చెప్పాను. దేశానికి సేవ చేసేందుకు నిరంతరం శాయశక్తులా కృషి చేశాను. గత పదేళ్ల కాలాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే ఎన్నో విజయాలు, సాఫల్యాలు కన్పిస్తున్నాయి. వాటిని చూసి గర్విస్తున్నాను. గత దశాబ్ద కాలంలో దేశం అన్ని రంగాల్లోనూ ఎంతో బలోపేతమైంది. ఈ విజయం తాలూకు ఘనత పూర్తిగా మీదే. మరింత అభివృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలెన్నో మన ముందున్నాయి. అందుకు మనమంతా సమష్టిగా కృషి చేయాలి. మన దేశానికి అద్భుత భవిష్యత్తుందన్న నమ్మకం నాకుంది. సంప్రదాయం-ఆధునికత, భిన్నత్వంలో ఏకత్వం వంటి సుగుణాలను మేళవించడం ద్వారా మన దేశం ప్రపంచానికే దారి చూపగలదు. తిరుగులేని ఆర్థిక శక్తిగా ప్రపంచ పటంలో భారత్ గణనీయమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. రాబోయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధించాలని, దేశాన్ని మరింత విజయపథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను. జైహింద్’’
రాష్ట్రపతితో మన్మోహన్ భేటీ
రాజీనామా లేఖ సమర్పణ
కొత్త ప్రభుత్వం వచ్చేదాకా కొనసాగండి
మన్మోహన్‌ను కోరిన ప్రణబ్ దాదా
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. తన అధికార నివాసమైన 7, రేస్‌కోర్స్ రోడ్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. తనతో పాటు తన మంత్రివర్గ రాజీనామా లేఖను కూడా ప్రణబ్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా వారందరినీ బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రణబ్, మన్మోహన్ పరస్పరం పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మన్మోహన్ మంత్రివర్గంలో ప్రణబ్ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల బాధ్యతలు నిర్వర్తించడం తెలిసిందే. ఇద్దరూ కొద్దిసేపు పాటు కరచాలనం చేస్తూ, సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉద్విగ్నభరిత వాతావరణంలో గడిపారు. ప్రణబ్ కార్యదర్శి ఒమితా పాల్‌తో పాటు రాష్ట్రపతి భవన్ సిబ్బంది అందరికీ మన్మోహన్ వీడ్కోలు తెలిపి వెనుదిరిగారు. ప్రణబ్ రాష్ట్రపతి భవన్ ప్రాంగణం బయటిదాకా వచ్చి మరీ మన్మోహన్‌ను సాగనంపడం విశేషం!