
అన్నాడీఎంకే నేత ఇంట్లో 100 కిలోల బంగారం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం రేపాయి. ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో 60 మంది ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. వేలూరు, కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేశారు. 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరి ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ 130 కోట్ల రూపాయలుగా తేల్చారు. కడ్డీల రూపంలో బయటపడిన బంగారం నిల్వలు చూసి అధికారులు అవాక్కయ్యారు.
టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్ రెడ్డి ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపట్టినట్టు తెలుస్తోంది.