
నోట్ల రద్దు తర్వాత దొరికిన భారీ సొమ్ము ఇదే!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ అధికారిక ప్రకటన చేసింది. మొత్తం రూ.142 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నాడని ఐటీశాఖ పేర్కొంది. ఇదంతా తన ఆస్తులేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీశాఖ నిర్ధారించింది.
తమిళనాడులో మొత్తం ఇసుక తవ్వకం లైసెన్స్ శేఖర్‌రెడ్డికే ఇచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన మొత్తంలో 127 కేజీల బంగారం, పాత కరెన్సీ 96.89కోట్లు ఉండగా, కొత్త రూ.2 వేలనోట్ల కరెన్సీ రూ.9.63కోట్లు ఉంది. బంగారం విలువ దాదాపు 36.29 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం, శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ నలుగురూ వ్యాపార భాగస్వాములని ఐటీశాఖ తెలిసింది.