మరో రూ.2.35 కోట్ల కొత్తనోట్లు స్వాధీనం
గువహటి: రెండువేల నగదు కోసం సామాన్యుడు అష్టకష్టాలు పడుతుంటే... మరోవైపు దేశవ్యాప్తంగా తవ్విన కొద్ది కొత్తనోట్లు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. తాజాగా అసోంలో గురువారం ఐటీ అధికారుల దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఈ దాడుల్లోరూ.2.35 కోట్ల కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు నాగాయన్ జిల్లా బబరాబజార్ లో ఈ దాడులు జరిపినట్లు సమచారం.
స్థానిక పొగాకు వ్యాపారులు అముల్య దాస్, తపన్ దాస్ వద్ద రూ.2.29 కోట్లు విలువ చేసే కొత్త రూ.2000, రూ.500 నోట్లను సీజ్ చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ వ్యాపారులిద్దరు పొగాకుతో పాటు, స్టేషనరీకి సంబంధించి హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, చట్టబద్దమైనదేనని, సరైన ఆధారాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. కాగా గత వారంలో గువాహటిలోని ఓ స్థానిక వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు విలువ చేసే కొత్త రూ.2000, రూ.500 నోట్లను అసోం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక కోల్‌కతాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బడా రియల్టర్ పర్సామల్ లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దాదాపు 25 కోట్లు పాత డబ్బును కొత్త నోట్లు మార్చేందుకు ప్రయత్నించినందుకు ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ తోపాటు, మైనింగ్ వ్యాపారాల్లో కూడా ఆయనకు పేరుంది. వడ్డీ వ్యాపారాలు కూడా నిర్వహిస్తారట. ముంబయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.