శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు | IT Raids at TTD Member and Telugu Businessman homes | Sakshi
Sakshi News home page

శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

Published Fri, Dec 9 2016 2:30 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM

శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు - Sakshi

శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

  • టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
  •  గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. వంద కిలోల బంగారం స్వాధీనం
  •  శేఖర్‌రెడ్డిని నియమించింది చంద్రబాబే.. అన్నాడీఎంకేలో కీలక నేత
  •  చెన్నైలో నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లలో ఐటీ సోదాలు
  •  తనిఖీల్లో దొరికిన డబ్బు 90 కోట్లు
  •  బంగారం 100 కిలోలు
  •  రెండు వేల నోట్లు 70 కోట్లు
  • సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు జె. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ నలుగురూ వ్యాపార భాగస్వాములని తెలిసింది. మొత్తం రూ.90 కోట్ల నగదు, కడ్డీల రూపంలో ఉన్న 100 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విలువ రూ.400 కోట్లుగా లెక్కకట్టినట్లు సమాచారం. పట్టుబడిన రూ.90 కోట్ల నగదులో రూ.70 కోట్లు కొత్త రూ.2వేల నోట్లని తెలిసింది. ప్రేమ్‌ రెడ్డి అనే వ్యక్తి నగదుకు బంగారు కడ్డీలు మార్పిడి చేస్తున్నట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం నేపథ్యంలో.. 60 మంది ఐటీ అధికారుల బృందం గురువారం ఉదయం ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు ప్రారంభించింది.

    చెన్నై టీ నగర్‌ బజుల్లా రోడ్డులోని శేఖర్‌రెడ్డి ఇంటిపైనా అలాగే ప్రేమ్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డి అనే మరో ఇద్దరి ఇళ్లపైనా దాడులు నిర్వహిం చారు. వేలూరు, కాట్పాడిలోని శేఖర్‌రెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. కాట్పాడి గాంధీనగర్‌లోని రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో ఐటీ అదనపు కమిషనర్‌ మురుగానంద భూపతి ఆధ్వర్యంలో గేటు తాళాలను  సెక్యూరిటీ గార్డు ద్వారా తెరిపించి ఇళ్లను సీజ్‌ చేశారు. ఒక్కొక్కటి కిలో బరువు కలిగిన వంద కడ్డీలను చూసి అధికారులే అవాక్కైనట్టు తెలిసింది. శేఖర్‌రెడ్డి సహా నలుగురినీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఇప్పటివlరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

    శేఖర్‌రెడ్డిని నియమించింది బాబే
    తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం సృష్టించాయి. శేఖర్‌రెడ్డి తల్లిదండ్రులు జగన్నాథరెడ్డి, నీలవేణిలు వేలూరు జిల్లా కాట్పాడి సమీపం తొండన్‌తులసి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. శేఖర్‌రెడ్డి  చెన్నైలో ప్రైవేటు పబ్లికేషన్‌ను ప్రారంభించి   చాలాకాలం క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్‌రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈయన తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక,  గనుల వ్యాపారాలు చేస్తున్నారు.

    సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ లోకి సులువుగా  వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్‌రెడ్డి ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. అయితే జయలలిత మరణించిన నాలుగోరోజే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమయ్యింది. గురువారం  రాత్రి పొద్దు పోయేవరకు సోదాలు కొనసాగాయి.

    కాట్పాడిలోని శేఖర్‌ రెడ్డి ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement