సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అక్కడి దృశ్యాలను చూసి విస్తుపోయారు. గురువారం రాత్రి కళ్యాణ్‌పురిలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌ను సందర్శించిన సిసోడియా తరగతి గదిలో ఓ జంట ఉండటంతో అవాక్కయ్యారు. వారు ఏకంగా తరగతి గదిలోనే వంటా వార్పూలో మునిగిపోవడంతో మంత్రితో పాటు పోలీస్ అధికారులు, ఇతరులు ఆశ్చర్యపోయారు.
ఆ గదిలో ఇంకా గ్యాస్ సిలిండర్, కార్పెంటర్ పరికరాలతో గూడిన బ్యాగ్ కనిపించాయి. స్కూల్ గార్డు తమ బంధువులకు తరగతి గదిని రెంట్‌కు ఇచ్చారని మంత్రి ఆరా తీయగా వెల్లడైంది. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నదని చెప్పడంతో సిసోడియా కంగు తిన్నారు. ఈ విషయం స్కూల్ ప్రిన్సిపల్‌కూ తెలుసని స్కూల్ సెక్యూరిటీ గార్డు చెప్పడం గమనార్హం. మంత్రి అనంతరం స్కూల్ నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు.