న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ)లో పనిచేస్తున్న బ్రహ్మచారుల కోసం ఐటీబీపీ ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐటీబీపీలో పనిచేసే సిబ్బందికి సరిపడే జీవిత భాగస్వామిని వెతికిపెట్టేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి. ఐటీబీపీలో ప్రస్తుతం 25 వేల మంది అవివాహిత పురుష, వేయి మంది అవివాహిత మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించాయి. వీరు సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తుండటం వల్ల జీవిత భాగస్వామిని వెతకడం వారి కుటుంబాలకు కష్టంగా మారుతోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
దళంలో ప్రస్తుతం 333 జంటలు (భార్యాభర్తలు) పనిచేస్తున్నాయి. ఐటీబీపీలో పనిచేసే చాలా మంది సంస్థలోనే పనిచేసే భాగస్వామి కావాలని కోరుకుంటున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో వారు పనిచేస్తున్న రీత్యా భాగస్వామితో కలసి పనిచేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో అవివాహిత లేదా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న, విడాకులు తీసుకున్న సైనికులు నమోదు చేసుకోవచ్చనితెలిపారు. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌లో 150 మంది నమోదు చేసుకున్నారు. సాయుధ బలగాల్లోని మొత్తం 10 లక్షల మందిలో 2.5 లక్షల మంది అవివాహితులు.
Comments
Please login to add a commentAdd a comment